Wednesday, 4 November 2026

ప్రభుత్వ భూములను కాపాడుతారా…

మా జెండాలు పాత మంటారా…
సిపిఐ మండల నాయకులు చొప్పరి శేఖర్,మంద భాస్కర్
కేసముద్రం ఆగస్టు 27 జనం సాక్షి  / మండల కేంద్రంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను మీరు కాపాడుతారా లేక మా జెండాలు పాతి ఇల్లు లేని  పేద ప్రజలకు పంచ మంటారా,జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామన్న హామీ ఏమైందని సీపీఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్,మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు.శనివారం మండల కేంద్రాల్లోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ… మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా, కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.దాదాపు మూడు సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను గుర్తించి రెవెన్యూశాఖాధికారులు అట్టి భూముల్లో హెచ్చరిక బోర్డులను పెట్టారన్నారు.హెచ్చరిక బోర్డులను ఆక్రమణ దారులు తొలగించిన, సంబంధిత  అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని,దాని ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.హెచ్చరిక బోర్డులో ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని రాసినది బోర్డు కే పరిమితమా అని ఎద్దేవా చేశారు.ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవాలని లేదా పేద ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు.ప్రభుత్వ భూముల పరిరక్షణకు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గ్రామ కమిటీలు వేసి పోడుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి దాదాపు తొమ్మిది నెలలు గడిచినా నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది అన్న చందంగా ఉందన్నారు.దరఖాస్తుల పరిశీలనలో జాప్యం తగదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పథకాలైన  రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం భూపోరాటాలను నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కాసు సాయిచరణ్, లైశెట్టి భాస్కర్, బాలాచారి, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.