Monday, 2 November 2026

ప్రైవేట్‌ పాఠశాలల్లో సగంమంది మహిళా టీచర్లే

అరకొర జీతాలతో నెట్టుకోస్తున్న వైనం

జీతాల పెంపు సంక్షేమాన్ని విస్మరించిన యాజమాన్యాలు

హైదరాబాద్‌,జూలై31(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా టీచర్లు ఉంటే వారిలో సగం మంది మహిళా టీచర్లు ఉన్నారని అంచానా. ఓ వైపు పాఠాలు చెబుతూ, పాఠశాలల్లో రాత పనులు చేస్తూ క్లర్క్‌గా, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు క్యాన్వాసింగ్‌ కూడా చేస్తూ ప్రచారకర్తలుగా బహుముఖంగా పనులు నిర్వహించడం ఏటా జరగుతోంది. తప్పని పరిస్థితిలో ఉద్యోగం చేయడానికి ప్రైవేట్‌ లేడీ టీచర్లు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇకపోతే ప్రైవేట్‌ టీచర్ల ఉద్యోగ భద్రత గాలిలో దీపం లాంటిదని, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఊడిగం చేస్తున్న ఉద్యోగభద్రత లేదన్నారు. దీంతో అభద్రతా భావంతో ప్రైవేట్‌ టీచర్‌ కొట్టుమిట్టాడుతున్నాడు. విద్యాహక్కు చట్టం ఎమ్‌ఎస్‌-1 ప్రకారం యాజమాన్యం ఆదాయంలో 15 శాతం డబ్బును ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కేటాయించాలి. పి.ఎఫ్‌, వైద్య, ఇతర సదుపాయాల నిమిత్తం కేటాయించాలి. కాని యాజమాన్యాలు నిబంధనలకు పాతర వేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేల రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ ఫీజుల పేరుతో యాజమాన్యాలు వసూళ్లు చేస్తూ ఖజానా నింపుకుంటున్నా, టీచర్ల ఆరోగ్యం కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. వారిక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లాంటి పాలసీలు అమలు కావడం లేదు. దీంతో ఏదైనా జబ్బు వస్తే ప్రైవేట్‌ ఆస్పత్రులకు అప్పులు చేసి కట్టాల్సి వస్తోంది. ప్రైవేట్‌ టీచర్లకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సెలవుల్లోనూ యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయి. పాఠశాల ఆస్తులను పెంచుకుంటున్న యాజమాన్యాలు టీచర్ల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కూడా చట్టాలు చేయాల్సి ఉంది. ఇకపోతే ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా టీచర్లు తీవ్ర ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. మానసిక, శారరీరక రుగ్మతలకు లోనవుతున్నారు. అరకొరజీతాలతోఒ పనిచేస్తున్న అనేకమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని

వైద్యులు చెబుతున్నారు. ఇవి దీర్ఘకాల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా నిద్రలేమి, గుండె సంబంధ వ్యాధులు, వెన్నముక సమస్యలను ఎదుర్కొటున్నారు. ప్రధానంగా నగరంలో ఇటీవల పలు కేసుల్లో వస్తున్న కేసులను పరిశీలించినప్పుడు ఆయా జబ్బులకు సంబంధించి వచ్చిన వారి వ్యక్తిగత వివరాలను అడిగితే అందులో ఎక్కువమంది వివిధ ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న వారే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. స్పాండిలైటిస్‌, వెన్నముక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నగరంలో ప్రముఖ స్పైన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సురేశ్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల సాధారణ సమయాలతో పాటు ప్రత్యేక తరగతుల పేరుతో గంటల కొద్దీ క్లాసులు ఏర్పాటు చేయడంతో మహిళా ఉపాధ్యాయులు శారీరక సమస్యలకు గురవుతున్నారు. గంటలతరబడి నిలబడి బోధన చేయడం, హఓంవర్క్‌ చేయించడం, అదేపనిగా నోట్‌ బుక్స్‌తో కుస్తీపట్టడం, చాక్‌పీస్‌ ధూళి కారణంగా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రముఖ ఫిజిషియన్‌ డాక్టర్‌ ఎన్‌ఎల్‌ కాంతారెడ్డి అన్నారు. వీరుత మ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోకపోవడం, పని ఒత్తిడి తగ్గించుకోక పోవడం కారణంగా 40 ఏళ్లల లోపే అనేక ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమవద్దకు స్‌ఆండిలైటిస్‌, వెన్నముక సమస్యలతో వచ్చే అనేకమంది లేడీ టీచర్లకు కి బెడ్‌ రెస్ట్‌ అవసరమని చెప్పినా అది పాటించే స్తితిలో వారు లేరని డాక్టర్‌ సురేశ్‌ అభిప్రాయపడ్డారు. ఉద్యోగం లేకపోతే ఇల్లు గడవని స్థితిలో వారు ఉండివుంటారని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో విద్యారంగ పటిష్టతకు పాటుపడుతూ సామాజిక సేవ చేస్తున్న ప్రైవేట్‌ టీచర్లు అనేక వృత్తిగతమైన ఇబ్బందులు ఎదుర్కొటున్నారని ప్రైవేట్‌ పాఠశాలల టీచర్లు వాపోతున్నారు. పెద్ద బాధ్యతను మోస్తున్న టీచర్లు అంతకుమించిన సమస్యలనూ భరిస్తున్నారు. పనిగంటలు పెచ్చి, ఇతర పనులను కూడా విధుల్లో చేర్చి ప్రైవేట్‌ టీచర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలే అరకొర జీతాలు ఇస్తూ, మరోవైపు అన్ని పనులు నెత్తిన వేస్తూ ఎదురు చెప్పితే ఉద్యోగాలు ఉండవని యాజమాన్యాలు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయని పలువురు ప్రైవేట్‌ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల చెల్లింపుల్లోనూ యాజమాన్యం వివక్ష చూపుతోంది. దీంతో పనుల ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యలను భరించాల్సి వస్తోందని వాపోతున్నారు.