Monday, 2 November 2026

సత్ఫలితాలు ఇస్తోన్న ట్రాఫిక్‌ రూల్స్‌

పాయింట్ల విధానంలో వాహనదారుల్లో మార్పు

హైదరాబాద్‌,జూలై31(జ‌నం సాక్షి): ట్రాఫిక్‌ ఉల్లంఘనలను కఠినతరం చేస్తూ కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకుని వచ్చాక మంచి ఫలితాలు వస్తున్నాయని ట్రాఫఙక్‌ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. చలాన్ల భయంతో ట్రాఫిక్‌ రైల్‌ పాటిస్తున్నారని, హెల్మెట్‌ వాడకం పెరిగిందన్నారు. సిగ్నల్‌ జంపింగ్‌ లాంటివి తగ్గాయని అంటున్నారు. గతంలో ఉన్నచలానాకు భిన్నంగా పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి రావడంతో వాహనదారులు జాగ్రత్త పడుతున్నారు. మద్యం తాగి బండి నడిపినా, సిగ్నల్‌ జంప్‌ చేసినా హెల్మెట్‌ లేకుంటే.. షార్ట్‌కట్‌ అని రాంగ్‌రూట్‌లో వెళ్తే.. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ చేసినా పెనాల్టీ పడబోతోంది. ఇలా యథేచ్ఛగా ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దవడం ఖాయం అన్న నిబంధనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రతి ఉల్లంఘనకు పోలీసులు పక్కాగా పాయింట్లు లెక్కగడుతున్నారు . మొత్తం పాయింట్లు 12కు చేరితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దయినట్టే. ఆపై మళ్లీ వాహనం నడిపితే జైలుకు పంపించేలా కఠిన చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ, రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నిలువరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటి సారిగా నిబంధనలను అతిక్రమించే వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేసేందుకు పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశ పెట్టింది. గత ఏడాదిగా వాహనదారుల్లో ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పాయింట్ల సిస్టమ్‌ అమలు చేయనున్నామని, దీని ద్వారా లైసెన్స్‌లు రద్దవుతాయంటూ ప్రచారం చేశారు. అభివృద్ధి చెందన దేశాల్లో అమలు చేస్తున్న ఈ పద్ధతి, మన దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి రావడంతో పలువురు శిక్షలకు గురయ్యారు. పలువురి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దయ్యాయి. ఉల్లంఘనదారులపై పాయింట్ల సిస్టమ్‌ అమలు చేయడంతో వాహనదారులు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ట్రాఫిక్‌, ఆర్టీఏ సిస్టమ్స్‌ అన్ని చక్కగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నట్లు పోలీసులువెల్లడించారు.కేవలంసక్రమంగా ట్రాఫిక్‌ నిర్వహణ తమ ఉద్దేశమని చెప్పారు. నిబంధనలు బేఖాతరు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. 12 పాయింట్లు జత కాగానే లైసెన్స్‌ రద్దవుతుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడంతో రోడ్డు సేఫ్టీ పక్కా ఉండేవిదంగా ప్రతి ఒక్కరి కృషి అవసరమని అధికారులు సూచిస్తున్నారు. నగర ట్రాఫిక్‌ పోలీస్‌ తీసుకొచ్చిన పలు సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. సిటీజన్‌ ఫ్రెండ్లీ విధానంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరముందని నగర పోలీసు ఉన్నతాధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో సూచిస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపొద్దని, అలా వాహనం నడిపిన వారికి జైలు శిక్షలు పడుతాయంటూ ప్రజల్లో అవగాహన కల్పించారు. దీంతో వాహనదారుల్లో ఎంతో మార్పు వచ్చింది. చాలామంది వాహనదారులు కొత్తగా లైసెన్స్‌లు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. పోలీసులు అవగాహన కార్యక్రమాలు, ఉల్లంఘనదారులపై ఛార్జిషీట్లు వేస్తూ కోర్టులో హాజరుపరుచుతుండడంతో, న్యాయస్థానాలు జైలు శిక్షలు విధిస్తున్నాయి. ఈ పరిణామాలతో వాహనదారులు చాలమంది లైసెన్స్‌లు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. గతంలో కొత్తగా లైసెన్స్‌లు తీసుకోవడానికి వచ్చే వారి శాతం 10 శాతం ఉండగా, తాజా 50 శాతానికి పెరిగిందని అంటున్నారు.