కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దుచేయాల్సిందే
హావిూలను విస్మరించిన టిడిపి ప్రభుత్వం
విజయవాడ,జూలై31(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశారు. దీనిపై అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం మాటనిలబెట్టుకోలేక పోయిందన్నారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి సీపీఎస్ విధానంవల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ దృష్ట్యా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపింఛను విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని కోసం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సంఘటిత పోరాటం సాగిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులపై పనిభారం పెంచేసి తనిఖీల పేరుతో సెస్పెన్షన్లు విధించడం మంచి పద్ధతికాదని, ఇలాంటి విధానాలను విద్యాశాఖ అధికారులు విరమించు కోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు ఇవ్వడంలో తప్పులేదుకానీ, సామర్థ్య పరీక్షలు నిర్వహించి గ్రేడింగులు ఇవ్వాలనుకోవడం సహేతుకం కాదని పేర్కొన్నారు. నూతన సాంకేతిక
పరిజ్ఞానాన్ని విద్యారంగ అభివృద్ధికి వినియోగించడం మంచి పద్ధతే అయినప్పటికీ ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడం సరికాదన్నారు. అవసరమైతే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించు కోవాలే తప్ప ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇలాంటి పరీక్షల నిర్వహణ సరికాదన్నారు. సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం పెంచితే బోధన కుంటుపడుతుందన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం లో సీసీఈ విధానాన్ని అనుసరించడంవల్ల విద్యార్థులపై ఆర్థికభారం పడుతోందన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు త్వరలో రాష్ట్రపతి ఆమోదం పొందనున్నాయని చెప్పారు. ఏకీకృత సర్వీసు నిబంధనల ఆమోదం కోరుతూ ఇప్పటికే పీఆర్‌టీయూకు చెందిన ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులతో కూడిన బృందం ఇటీవలకాలంలో దిల్లీవెళ్లి పలువురు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం లభించగానే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల, ఉపవిద్యాశాఖాధికారుల కొలువులు, డైట్ అధ్యాపకుల కొలువులు, జూనియర్ అధ్యాపకుల కొలువులు రెగ్యులర్ ప్రాతిపతికన భర్తీఅవుతాయని చెప్పారు. బీఈడీ, టెట్, డీఎస్సీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించినవారికి సామర్థ్య పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు.