Tuesday, 3 November 2026

ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో పయనించాలి,

 జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ హరీశ్, అధికారులు,
మేడ్చల్(జనంసాక్షి):  తెలంగాణ సిద్ధాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాట అందరికీ ఆచరణీయమని ఆయన చూపిన బాటలో నడుచుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
శనివారం ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ హరీశ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాల పట్ల సామాన్య ప్రజానీకానికి సైతం అవగాహన కలిగించి రాజకీయ చైతన్యాన్ని రగిలించి జనహృదయనేతగా నిలిచారని  గుర్తు చేశారు.  తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం  చేశారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారని కలెక్టర్ పేర్కొన్నారు.  ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎన్నో విధాలుగా పాటుబడిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రధాత అని… ఆయన చూపిన బాటలో నడుచుకోవాలన్నారు.  తెలంగాణ ఉద్యమానికి దారి చూపారని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు పయనించి  బంగారు తెలంగాణ సాదించారు అని  కలెక్టర్ తెలిపినారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలకు గుర్తుగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టుకొన్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ప్రతియేటా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్ (ఎఫ్ఏసీ), జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిణి ఝాన్సీరాణి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, యువజన క్రీడల అధికారి బలరాం , విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు బి.రమేష్ చారి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.