Thursday, 5 November 2026

ఫలించిన కడియం పరిశ్రమ

వెబ్‌ ప్రక్రియతో సజావుగా టీచర్ల బదిలీలు

అవినీతికి తావు లేకుండా ముగిసిన కార్యక్రమం

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తొలిసారి నిర్వహించిన ఉపాధ్యాయుల వెబ్‌ కౌన్సెలింగ్‌ బదిలీలు విజయవంతమయ్యాయి. జూన్‌ 6 నుంచి ప్రారంభమైన ఈ పక్రియ జూలై6తో ముగిసింది. డిప్యూటి సిఎం కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ద వహించి డదిలీల ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూశారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు వారితో నిరంతరంగా చర్చించి ప్రక్రియ సజావుగా సాగేలా చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్‌కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. వెబ్‌కౌన్సెలింగ్‌ విధానంపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత గందరగోళానికి గురయ్యారు. డీఈవోలకు, ఉపాధ్యాయులకు మధ్య తలెత్తిన బదిలీ అంశాలను అధికారులు సత్వరమే పరిష్కరించారు. అటు అభ్యంతరాలకు గడువు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి విజ్ఞప్తులు రావడంతో.. అవసరమైనప్పుడల్లా బదిలీ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. అటు బదిలీల పక్రియలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా.. పాయింట్ల వారీగా వారికి లభించే ప్రాంతాలకు బదిలీ అయ్యారు. గెజిటెట్‌ హెడ్‌మాస్టర్ల వెబ్‌కౌన్సెలింగ్‌ బదిలీల పక్రియలో ప్రాంతాల కేటాయింపులో ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా కోరుకున్న ప్రాంతం కంటే మంచి ప్రాంతం వచ్చిందని సంతోషిస్తున్నారు. మొత్తం 75 వేల 317 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తప్పనిసరి బదిలీ అయ్యే వారు 31వేల 514 మంది ఉన్నారు. 43 వేల 803 మంది ప్రతిపాదనలతో బదిలీ పొందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లలో తప్పనిసరి బదిలీ పొందిన వారు 541 మంది కాగా.. సాధారణ బదిలీ పొందినవారు 1,668 మంది ఉన్నట్టు అధికారులు వివరించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం వల్ల మేలు జరిగిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రకటించారు. పైరవీలకు ఆస్కారం లేకుండా కోరుకున్న దానికంటే మంచి ప్రాంతమే లభించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కడియం శ్రీహరికి కూడా ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.