Wednesday, 4 November 2026

మరోమహిళతో భర్త సరాగాలు

తన్ని తరిమి కొట్టిన భార్య .. ఆపై పోలీసులకు అప్పగింత

భువనగిరి,జూలై7(జ‌నం సాక్షి): వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను వెంటాడి మరీ తరిమికొట్టిందో గృహిణి. అయితే ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. ఈ ఘటన భువనగిరిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏవోగా పనిచేసిన హరిప్రసాద్‌కు నిర్మలతో పెళ్లయినా, మరో మహిళతో సంబంధం నెరపుతున్నాడు. శనివారం ఇలా ఆ మహిళతో ఉండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని వెంటాడి తరిమి కొట్టింది. అంతేగాకుండా పోలీసులకు అప్పగించింది. భార్య బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కలెక్టరేట్‌లో విధులు నిర్వర్తించే మరో మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడన్న కారణంతో కొద్దికాలం క్రితమే హరిప్రసాద్‌ను విధుల నుంచి తప్పించారు. గతంలోనూ ఇదే విషయంపై పెద్ద గొడవ జరగడంతో సదరు ఏవోను సెలవుపై పంపించారు. అయినా అతను పద్ధతి మార్చుకోకపోగా.. తనను, పిల్లల్ని వేధిస్తున్నాడంటూ భార్య నిర్మల ఆరోపించింది. ఓ ఇంట్లో ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను బయటకి ఈడ్చి వెంటాడి తరిమికొట్టింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.