Monday, 2 November 2026

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై..

జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం
– ఆక్రమణలను కూల్చివేసిన అధికారులు
– కూల్చివేతలకు 120మందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు
– కూల్చివేత శిథిలాలను ప్రత్యేక వాహనాల్లో తరలింపు
– మూడు రోజుల పాటు కొనసాగనున్న ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపింది. శనివారం ఉదయం నుంచి కూల్చివేతలను అధికారులు చేపట్టారు. అబిడ్స్‌, అవిూర్‌ పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, కాచిగుడా, కోఠి, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, దిల్‌ సుఖ్‌ నగర్‌ ఏరియాల్లో శనివారం ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న పాదచారుల బాటలపై దుకాణ యజమానులు స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో పాదచారుల బాట కనుమరుగైంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వీటిని.. తీసివేసేందుకు రంగంలోకి దిగారు. నగరంలోని దాదాపు 5వేలకు పైగా ఆక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని కూల్చివేసేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు. పాదచారుల బాటలపై ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులు, మెట్లు, ప్రహరీ గోడలను కూల్చివేస్తున్నారు. దీనికోసం 120 మందితో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కూల్చివేసిన శిథిలాలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పక్రియ కొనసాగనుంది. సిబ్బందికి కూల్చివేతలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. అధునాతన యంత్రాలనూ రంగంలోకి దించుతున్నామన్నారు. గతంలో మాదిరి ఒత్తిడికి తలొగ్గి కూల్చివేతల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదని స్పష్టం చేసింది.
ఆక్రమణలతో పాదాచారులకు ఇబ్బందులు..
హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ పరిధిలో సుమారు పది వేల కిలోవిూటర్ల రోడ్లున్నాయి. అందులో కొద్ది పాటి రహదారులకు మాత్రమే పాదచారుల బాట ఉంది. అదీ దుకాణదారులు, చిరువ్యాపారులతో ఆక్రమణకు గురై ఉంది. ఫలితంగా పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తుంది. వేగంగా దూసుకుపోతున్న వాహనాల మధ్య బిక్కుబిక్కుమంటూ పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. పలు సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. కాగా గత కొంతకాలంగా పాదచారుల బాట ఆక్రమణలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తోంది. ఏమాత్రం ఉపేక్షించకుండా ఆక్రమణల్ని తొలగించి పాదచారుల హక్కుల్ని కాపాడాలని జీహెచ్‌ఎంసీని ఆదేశిస్తుంది. కోర్టు ఆదేశించిన ప్రతిసారీ బల్దియా యంత్రాంగం కూల్చివేతలకు దిగడం, అనంతరం రాజకీయ ఒత్తిడితో కార్యక్రమాన్ని అటకెక్కించడం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి ఆక్రమణల్ని తొలగించే బాధ్యతను ఇటీవల ఏర్పడిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటికి అప్పగించారు. మొత్తం 4,133 నిర్మాణాలు.. మొదటి దశలో 4,133 నిర్మాణాలను తొలగించాలని బల్దియా నిర్ణయించింది. ఆయా ఆక్రమణలు 127.5కి.విూల పొడవున ఉన్నాయని ఐపీఎస్‌ అధికారి విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. తమ సిబ్బంది వచ్చేంత వరకు ఆగకుండా యజమానులు స్వతహాగా నిర్మాణాలను తొలగించుకోవాలన్నారు. రాజకీయంగా, అధికారికంగా
ఒత్తిడి తెచ్చి పక్రియను అడ్డుకోవాలనే ప్రయత్నాలు ఫలించవని వెల్లడించారు.
ప్రత్యామ్నాయ స్థలం చూపించాలి..
ఆక్రమణల తొలగింపుతో రోడ్డున పడ్డామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ విధంగా జీవనోపాధి పొందుతున్నాం అని.. ఇప్పుడు ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోవాలంటే.. అక్కడికి కస్టమర్లు ఎలా వస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తాము వ్యాపారాలు కొనసాగించేందుకు తమకు స్థలాలు ఇప్పించాలని కోరుతున్నారు.