– ఉక్కు కర్మాగారం గురించి కేసీఆర్ పెదవి విప్పాలి
– కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు6(జనం సాక్షి ) : బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అసలు బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అన్న నినాదం ఏమైందంటూ కేసీఆర్‌ను పొంగులేటి ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి కేసీఆర్ పెదవి విప్పడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 11అంశాల విూద ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ మాట్లాడారన్నారు. మరి ఇక్కడ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మోదీ వద్ద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేటీఆర్ చెవిలో పువ్వులు పెట్టే మాటలు చెప్పారని, రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో కానీ.. రాష్ట్ర ప్రయోజనాల గురించి అసలు మాట్లాడరన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉస్మానియాకి ఘన స్వాగతం పలకాల్సింది పోయి.. అడ్డుకుంటామని అనడం ఎందుకని ప్రశ్నించారు. అందరం కలిసి పోట్లాడదాం అంటే కేసీఆర్ ఒక్కడే మోదీని కలిసి వస్తారని, రహస్య అజెండా.. రాజకీయ అజెండా తప్పితే కేసీఆర్‌కు మరొకటి లేదని పొంగులేటి విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ రోజుకో ప్రకటనలు చేస్తూ, రోజుకో పథకాన్ని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అరచేతిలో వైకుంఠం చూపుతున్న కేసీఆర్.. హావిూల అమల్లో, పథకాల అమల్లో చిత్తశుద్దిచూపడం లేదని, ఫలితంగా పేరుకు పథకాలున్నా అవి పేద, మధ్య తరగతి వారికి ఏమేరకు చేరడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికైన కేసీఆర్ తనతీరు మార్చుకొని పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పొంగులేటి సూచించారు.




