Wednesday, 4 November 2026

బర్డ్‌ ఫ్లూతో టీ.సర్కారు అలర్ట్‌

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తొర్రూరులో బయటపడిన బర్డ్ ఫ్లూ వ్యాధితో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. బర్ట్‌ ఫ్లూ వైరస్‌ ఆనవాళ్లను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్.. వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. తొర్రూరు గ్రామంలో పర్యటించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన ఫౌల్ట్రీతో పాటు కిలోమీటర్ పరిధిలోని అన్ని ఫౌల్ట్రీల్లోను తనిఖీలు నిర్వహించారు.
నోమెన్ జోన్‌గా….
మరోవైపు.. ఫౌల్ట్రీలకు వెళ్లే మార్గాలను నోమెన్ జోన్‌గా ప్రకటించిన అధికారులు.. ముందస్తుగా ఇప్పటి వరకు లక్షా 80 వేల కోళ్లను పూడ్చిపెట్టారు. ఇదేవిధంగా పరిసర గ్రామాలతో పాటు ఫౌల్ర్టీ ఫారాల వద్ద పూర్తిస్థాయి స్టెరిలైజేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారుల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించడం లేదు.
బాలకృష్ణారెడ్డి కి చెందిన పౌల్ట్రీ ఫాంలోనే వైరస్….
రాష్ట్రంలో 6.91 కోట్ల కోళ్లు ఉంటే కేవలం తొర్రూరులోని బాలకృష్ణారెడ్డి అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫాంలోనే వైరస్ సోకినట్లు తేలిందని వైద్య అధికారులు తెలిపారు. మిగిలిన ఏ గ్రామంలోనూ బర్ట్‌ ఫ్లూ వ్యాధి జాడలు లేవని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి సోకిన జోన్‌లో కోళ్లను నాశనం చేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌ నుంచి దాణాలో….
ఉత్తరప్రదేశ్‌ నుంచి దాణాలో వచ్చిన వైరల్‌ వల్ల హెచ్‌-5, ఎన్‌-1 క్రిమి బర్డ్‌ ఫ్లూకు దారితీసిందని ప్రాథమిక నిర్థారణలో తేలింది. అయితే కోడిమాంసం, కోడిగుడ్లను వండే సమయంలో కనీసం 20 నిమిషాలకు తక్కువ కాకుండా ఉడికిస్తే ఈ వైరస్‌ చనిపోయే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గుడ్లను నేరుగా పగులగొట్టుకుని తాగడం ప్రస్తుత పరిస్థితిలో మంచిది కాదని సూచిస్తున్నారు.
రవాణా నిలిపివేసిన ఏపీ….
మరోవైపు.. తొర్రూరుతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లను హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను, కోడిగుడ్ల రవాణాను నిలిపివేసింది. ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కోడిగుడ్లు రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. బర్డ్‌ ఫ్లూ కారణంగా తమకు సుమారు రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని కోళ్లఫాం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వైన్‌ ఫ్లూ మాదిరిగానే ఉంటాయి….
పక్షులనుంచి మనుషులకు వ్యాపించే ఈ ఏవిఎన్ ఇన్‌ఫ్లూ యెంజా లక్షణాలు కూడా స్వైన్‌ ఫ్లూ మాదిరిగానే ఉంటాయని వైద్యులు తెలిపారు. 105 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్ర జ్వరం, జలుబు, గొంతు నొప్పివంటి లక్షణాలు ఉంటాయన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *