Tuesday, 3 November 2026

బస్సుల్లో పరిశుభ్రతను పట్టించుకోరా?

హైదరాబాద్‌,జ‌నంసాక్షి): లాభాల్లో పరుగులు తీస్తున్న ఆర్టీసీ డిపోలు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏసీ బస్సుల్లో ఏసీ పని చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. సీట్లు బాగుండవు, కిటికీ తెరలు ఉండవు, ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం మాని
ప్రయాణికుల సేవలపై దృష్టి సారిస్తే బాగుంటుంది. అధిక ప్రయాణ రుసుం వసూలు చేస్తున్నా శుభ్రతలో వెనుకంజ వేస్తున్నాయి. నెలల తరబడి పట్టించుకునే వారు లేకపోవడంతో బస్సుల్లో చెత్త పేరుకుని పోతోంది. ప్రధానంగా దూరప్రాంతాల బస్సుల్లో పరిశుభ్రత పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రయాణికులు అధిక ధర చెల్లించి అసౌకర్యంగానే ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు వినోదంతోపాటు, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు సాధారణ బస్సు ఛార్జీ కంటే అదనంగా వసూలు చేస్తోంది. అందుకు తగినట్లుగా జిల్లాలోని మూడు డిపోల పరిధిలో సేవలందడం లేదు. సూపర్‌లగ్జరీ బస్సులోని టీవీల్లో వినోదం కోసం సినిమాలు, పాటలు ప్రదర్శించేందుకు డిపో నుంచి ప్రతి బస్సుకు ప్రతి నెల కొంతమొత్తం చెల్లించేలా గుత్తేదారుకు బాధ్యతలు అప్పగించారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో ఒకటి,
రెండు బస్సులు మినహా ఏ బస్సులోనూ వినోదం అందడం లేదని ప్రయాణికులు అగ్రహం వ్యక్తం
చేస్తున్నారు. ఒక వేళ సినిమా ప్రదర్శించినా మధ్యలో ఆగిపోవడం, అదే సినిమాను మళ్లీ మళ్లీ చూపించడంతో ప్రయాణికులు విసిగిపోతున్నారు.సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి. రెండు మూడు నెలలకోసారి శుభ్రం చేయడం, అప్పటి వరకు సీట్లు చెత్తగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
……………….