Thursday, 5 November 2026

బాబు గోగినేని అలాంటోళ్లకు ఆదర్శం

– ఒక కులం తక్కువ కాదు.. మరొక కులం ఎక్కువ కాదు
– అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే
– స్వామి పరిపూర్ణానంద
– గృహనిర్భందంలోనే పరిపూర్ణానంద
హైదరాబాద్‌, జులై10(జ‌నం సాక్షి ) : గత రెండ్రోరోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా దారుణమని శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు కులాలు, మతాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడంతో కోట్లాది మంది హృదయాలు గాయపడ్డాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కులాల ప్రాతిపదికన చూడకూడదని అభిప్రాయపడ్డారు. ఒక కులం తక్కువ కాదు.. మరొక కులం ఎక్కువ కాదని.. అన్ని కులాలు, మతాలు ఒకటేనని అన్నారు. అన్నిటికీ గౌరవం, మర్యాద, విలువలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మతాల ఉనికిని దెబ్బతీసే హక్కు ఎవరికి లేదని.. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. బాబు గోగినేని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
గృహ నిర్బంధంలోనే పరిపూర్ణానంద..
స్వామి పరిపూర్ణానంద గృహనిర్భంధం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లోని స్వామి బస చేసిన నివాసం నుంచి ఆయన్ని పోలీసులు బయటకు రానివ్వడం లేదు. పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్వామిజీ ఇంటికి వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విూడియాతో పాటు ఇతరులను కూడా అనుమతించడంలేదు. ఆయన్ని కలిసేందుకు వస్తున్న వారిని పోలీసులు అనుమతించకపోవటంతో తిరిగి వెళ్తున్నారు. భక్తి భావాలతో చేపట్టదలచిన యాత్రకు పోలీసులు, ప్రభుత్వం అనుమతించాలని హిందూ ధార్మిక సంఘాలు కోరుతున్నాయి.  మరోవైపు శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామచందర్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. స్వామి ఇంటి వద్దకు వెళ్లనీయకుండా కొద్ది దూరంలోనే పోలీసులు ఎమ్మెల్సీ వాహనాన్ని నిలిపివేశారు. స్వామితో మాట్లాడి వెళతానని ఆయన కోరినప్పటికీ వారు అంగీకరించలేదు. దీంతో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ రామచందర్‌ రావు అందోళన వ్యక్తం వేశారు. హిందుధర్మ పరిరక్షణ కోసం పరిపూర్ణానంద స్వామి కృషి చేస్తుంటే అయనను గృహనిర్బంధం చేయడం తగదని రామచందర్‌రావు అన్నారు. స్వామిజీకి కావాల్సిన న్యాయ సహాయం చేసేందుకు భాజపా తరఫున సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.