Wednesday, 4 November 2026

బిసిల ఆర్థిక బలోపేతానికి కార్యాచరణ

స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం

జిల్లా స్థాయిలో జాబితాల రూపకల్పనకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు

ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సవిూక్షలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): బీసీ వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వారికి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు జిల్లా స్థాయిల్లో రూపొందించడం ద్వారా వారిని ఆదుకోనున్నారు. బీసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆర్థిక సాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని కోరారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం రాయితీతో ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. వెనుకబడిన తరుగతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్‌ లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సవిూక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌ గా, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలని చెప్పారు. లబ్దిదారుల జాబితా తయారు కాగానే, ఆర్థిక సాయం అందించాలని సూచించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్దిదారులకు సాయం అందించాలని ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకోసం వినియోగించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది నుంచి మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభించనున్నట్టు సీఎం ప్రస్తావించారు. మైనారిటీ రెసిడెన్షియల్స్‌ పాఠశాలల్లో ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని బీసీలకే కేటాయిస్తామని, బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. గీత కార్మికుల సంక్షేమం కోసం మరోసారి అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో

వెనుకబడిన తరగతుల కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశాం. యాదవులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్‌, గంగపుత్రులు తదితర మత్స్యకారులు లాభం పొందుతున్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలి కులస్తులకు మేలు కలిగింది ముఖ్యమంత్రి అన్నారు. ఇంకా చాలా కులాలు కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాయి. అలాంటి వారికి చేయూత అందివ్వాలి. విశ్వ కర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతో పాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందివ్వాలి. కులవృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారాలు చేసే వారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్‌ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

సమావేశంలో శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనా చారి, మంత్రులు ఈటల రాజేందర్‌, జోగు రామన్న, మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, గణెళిష్‌ గుప్తా, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్‌ ఎండీ లోకేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీల కోసం తీసుకోవాల్సిన సంక్షేమ చర్యలపై లోతుగా చర్చించారు.