Thursday, 5 November 2026

బిసి రిజర్వేషన్లపై చిత్తశుద్ది లేని ప్రభుత్వం

అఖిలపక్ష భేటీలో చర్చించాలి: దాసోజు

హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): బీసీలకు 32 శాతం రిజర్వేషలపై కేసీఆర్‌ ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డదిడ్డంగా నిర్ణయం తీసుకొని.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడమేంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా పంచాయితీరాజ్‌ చట్టంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. పంచాయతీరాజ్‌ చట్టంపై వెంటనే అసెంబ్లీ నిర్వహించాలన్నారు. కొత్త పంచాయితీరాజ్‌ చట్టంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని తెలిపారు. బీసీలకు 50 రిజర్వేషన్‌ కల్పిస్తే కాంగ్రెస్‌ భేషరతుగా కొత్త పంచాయితీరాజ్‌ చట్టానికి మద్దతు పలుకుతోందన్నారు. బీసీ కుల సంఘాలు 52 శాతం రిజర్వేషన్‌ కోసం పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున బీసీలకు 52 శాతం రిజర్వేషన్‌ కోసం పోరాడుతామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన వారిలో నాగరకర్నూల్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ గోపాల్‌ రెడ్డి కూడా ఉన్నారని దాసోజు శ్రవణ్‌ వెల్లడించారు.