Friday, 6 November 2026

బీజేపీ నేతలతో నేను భేటీకాలేదు

టీడీపీ అసత్యాలను ప్రచారం చేస్తుంది
ఒకపార్టీ నేత మరోపార్టీ నేతను కలకూడదని ఎక్కడైనా చట్టం ఉందా?
చంద్రబాబు మానసిక ఒత్తిడి తారాస్థాయికి చేరింది
విలేకరుల సమావేశంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
హైదరాబాద్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : భారతీయ జనతా పార్టీ నేతలతో తాను సమావేశమైనట్టు వస్తున్న వార్తలు అబద్ధమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. అనైతిక రాజకీయాలతో తెలుగజాతి పరువు తీస్తున్నారన్నారు. వ్యక్తిగత పనుల విూద నేను ఢిల్లీ వెళ్లానని, ఏపీ భవన్‌లో అన్నీ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ విప్‌ కూన రవికుమార్‌లు ఏపీ భవన్‌లో కలిశారని, రవికుమార్‌ నన్ను ఆలింగనం కూడా చేసుకున్నారన్నారు.  మరి ఈ విజువల్స్‌ ఎందుకు చూపించడం లేదని బుగ్గన ప్రశ్నించారు. రవి నాకు కాలేజ్‌ మిత్రుడని, టీడీపీ విప్‌ నన్ను కౌగిలించుకుంటే ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాట్టా అంటూ ప్రశ్నించారు. సత్యనారాయణతో కలిసి భోజనం చేస్తేనే ఇంత ఉలిక్కి పడతారా?  మేము నిజంగా కలిస్తే ఏమైపోతారు? అతిథి గృహం లాబీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మధ్య మర్యాదపూర్వక సన్నివేశం చుట్టూ ఓకథ అల్లడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనమన్నారు. మా పార్టీ నేతలు ఎవరిని కలిసిన టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో, ఉలిక్కిపడుతున్నారో.. అసలు ఏం జరిగిందని ఇంతలా ప్రచారం చేస్తున్నారో అర్థంకావటం లేదన్నారు. అచ్చెన్నాయుడు మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదని బుగ్గన విమర్శించారు. అయనకు మెదడు లేదని మరోసారి నిరూపించుకున్నారన్నారు. మరోవైపు మంత్రి లోకేశ్‌ చాలా అమాయకులుగా ఉన్నారన్నారు. ఆయన ట్వీట్లు చూస్తే.. తనకున్న ‘పప్పు’ బిరుదును పోగొట్టుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లే ఆటలో దిగినట్టు ఉందన్నారు. ఒక పార్టీ నేతను.. మరో పార్టీ నేత కలవకూడదని ఎక్కడైనా చట్టముందా అని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి విూరు మాట్లాడటం విడ్డూరంగా ఉందని,  సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని, టీడీపీ నాయకులు మానసిక స్థితి ఉన్మాదానికి చేరిపోయిందని, తెదేపా నేతలు అప్రమత్తం కాకుంటే ఇబ్బందులు పడతారని బుగ్గన హెచ్చరించారు.