Tuesday, 3 November 2026

బీజేపీ రైతుల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది

– కాంగ్రెస్‌ది అంగడి యాత్ర అయితే.. బీజేపీది సర్కస్‌ యాత్ర
– తెరాస ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
హైదరాబాద్‌, జులై2(జ‌నం సాక్షి ) : రైతుల గురించి బీజేపీ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెరాస భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మద్దతు ధర నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే బీజీపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఎర్ర జొన్నల రైతులకు న్యాయం చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని బీజేపీ లక్ష్మణ్‌ కు తెలియదన్నారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని అందరూ అంటుంటే.. బీజేపీ ఇంకా బోర్ల గురించి మాట్లాడుతోందని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విమర్శించారు. లక్కంపల్లి ఫుడ్‌ పార్క్‌ పనులు జరుగుతుంటే జరగడం లేదని బీజేపీ నేతలు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. లెదర్‌ పార్కుకి జీవో వచ్చినా కేందప్రభుత్వం నుంచి నయా పైసా రాలేదని గుర్తుచేశారు. నిజామాబాద్‌ లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ కార్పొరేట్‌ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విమర్శించారు. అరవింద్‌ తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. తమ ఎంపీ మహిళ అని కూడా చూడకుండా అరవింద్‌ ఆమెను ఏక వచన సంభోదనతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్‌ తన భాష మార్చుకోకుంటే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. మిషన్‌ భగీరథ కవిూషన్‌ భగీరథ అయితే ప్రధాని మోడీ గజ్వేల్‌ లో ఆ పథకాన్ని ఎందుకు ప్రారంభించారని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నిలదీశారు. నల్లధనాన్ని వెలికి తీస్తామన్న మోడీ పాలనలో స్విస్‌ బ్యాంకుల్లో పెరిగిన భారతీయుల డబ్బుపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ చీరలపై కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు మంచివి కాకపోతే కేంద్ర మంత్రులు వాటిని ఎందుకు పొగుడుతున్నారని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు అవినీతి విషయంలో కుమ్మక్కయ్యారని విమర్శించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా? అని జీవన్‌ రెడ్డి నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న ఒక్క పథకానికైనా కేంద్రం సాయం చేస్తోందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారించాల్సింది లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్‌ ది అంగడి యాత్ర అయితే బీజేపీ ది సర్కస్‌ యాత్ర అని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇపుడున్న సీట్లు కూడా రావని స్పష్టం చేశారు.  బాధల తెలంగాణ అని మాట్లాడుతున్న బీజేపీకి కచ్చితంగా ‘బొందల తెలంగాణ’ అవుతుందని, తెలంగాణ ప్రజలు బీజేపీని బొంద పెట్టడం ఖాయం అన్నారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూల్లో 99 శాతానికి పైగా నెరవేర్చామని ఎమ్మెల్యే జీవన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ హావిూల అమలుపై శ్వేతపత్రం ఇస్తామని, దమ్ముంటే బీజేపీ నేతలు ఇచ్చిన హావిూలపై, కేంద్రం చేస్తున్న పనులపై శ్వేత పత్రం ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జీవన్‌ రెడ్డి చెప్పారు. బీజేపీ నేతలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. అబద్దాలు మాట్లాడితే బీజేపీ కి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ పై క్రమశిక్షణ చర్యలను పార్టీ చూసుకుంటుందని జీవ్‌ రెడ్డి చెప్పారు. డీఎస్‌ కు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించిందని గుర్తుచేశారు.