Tuesday, 3 November 2026

బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం

ఉస్మానియా యూనివర్సిటీ,  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఈ నెల 30న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. టీఎస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూలో ‘తెలంగాణ తెచ్చిన విద్యార్థులకు ఎన్‌కౌంటర్లే బహుమానాలా’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మేడారం ఎన్‌కౌంటర్‌ ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని అన్నారు.ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అంటూ ప్రచారం చేసుకుని తీరా అధికారంలోకి రాగానే వారిని కాల్చి చంపుతున్నారని, ఇదేనా కేసీఆర్‌ ఎజెండా అని ప్రశ్నించారు. తెలంగాణలో పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం ఓయూ జేఏసీని మళ్లీ పునరుద్ధరించి రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. మావోయిస్టుల ఎజెండాను అమలు చేయడం బూర్జువా పార్టీలకు సాధ్యం కాదన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు కోట శ్రీనివాస్‌గౌడ్‌, లింగస్వామి, మందాల భాస్కర్‌, కంచర్ల బద్రి, అరుణాంక్‌, హబీబ్‌ ఖాద్రీ, రామారావుగౌడ్‌, డేవిడ్‌, కృష్ణ, నాగేశ్వర్‌రావు, ఆజాద్‌, సర్దార్‌, మోహన్‌ధారావత్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *