Tuesday, 3 November 2026

బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్‌ నిర్వాహకుల కోసం వేట

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ):  అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ పెద్ద మొత్తంలో డిపాజిట్లు, చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు పారిపోయిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటూ ఆదివారం మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయగూడకు చెందిన శైలేష్‌ గుజ్జార్‌ తన భార్య నందినితో కలిసి మహంకాళి పరిధిలోని సుభాశ్‌ రోడ్డులో 20 ఏండ్లుగా శ్రీ రిషబ్‌ చిట్‌ఫండ్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. చత్రియా కులస్థుల నుంచి నూటికి రెండురూపాయల చొప్పున వడ్డీ చెల్లిస్తామంటూ కోట్లాది రూపాయలు డిపాజిట్‌ చేయించారు. చిట్టీలు వేసిన వారికి పూర్తయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులకు కూడా వడ్డీ ఇస్తానంటూ ఆశపెట్టి తనవద్దే ఉంచుకున్నాడు. వినియోగదారులు ఒత్తిడి చేస్తుండడడంతో దాటవేస్తూ వచ్చాడు. శనివారం సాయంత్రం చిట్‌ఫండ్‌ కార్యాలయానికి పలువురు రాగా తాళం వేసి ఉంది. అనుమానంతో ఇంటికెళ్లగా అక్కడ కూడా తాళం ఉంది. మోసపోయామని గ్రహించిన పలువురు ఆదివారం ఉదయం సంస్థ యజమాని ఇంటి ముందు గుమికూడారు. అనంతరం బాధితులంతా కలిసి మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీకి చెందిన సంతోష్‌కుమార్‌, సోదరికి, కోడళ్లకు కలిపి రూ.27 లక్షలు రావాల్సి ఉందని పోలీసులకు తెలిపాడు. అలాగే బోయిన్‌పల్లి వాసి కిరణ్‌కు రూ.10 లక్షలు, బేగంబజార్‌కు చెందిన శంకర్‌కు రూ.2,61 లక్షలు, నేత్ర అనే మహిళకు రూ.15 లక్షలు, ఇలా పదిమందికి రూ.80 లక్షల వరకు రావాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా వందలాది మంది బాధితులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా శైలేష్‌ గుజ్జార్‌ తన ఇంటిని మార్ట్‌గేజ్‌ చేసి రూ.60 లక్షలు తీసుకున్నాడని బాధితుల్లో ఒకరు తెలిపారు. ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.