మారుమోగిన గణనాధుని నామస్మరణం…
*ఘనంగా కూకట్ పల్లి వినాయక భక్త
బృందం ఆధ్వర్యంలో శోభాయాత్ర…
*భక్తులను అలరించిన కోలాట భజన బృందం…
*5లక్షల 25 వేల రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న మర్రి కృష్ణారావు…
కూకట్ పల్లి జనంసాక్షి :తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న బొజ్జ గణపయ్యను కూకట్ పల్లి వినాయక భక్త బృందం వారు శుక్రవారం నిమజ్జనానికి తరలించారు.కూకట్ పల్లిలోని వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన గణనాధుని మహానిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది.భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పాత శివాలయం వీధుల గుండా కుకాట్ పల్లి రామాలయం వరకు వివిధ మార్గాల్లో శోభాయాత్ర జరిగింది. ఎన్ సుజాత,చిరంజీవి ల కోలాట బృందం భక్తులను అలరించాయి. భక్త బృందం భక్తుల కోలాటాలు, నృత్యాలు, విజిల్స్, డప్పు శబ్దాలతో కూకట్ పల్లి రహదారులన్నీ దద్దరిల్లిపోయాయి.కూకట్ పల్లి రహదారుల గుండా శోభాయాత్ర శోభాయమానంగా జరగగా, అందంగా అలకరించిన భారీ వాహనాల్లో గణనాథుడిని తరలించి రంగదాముని చెరువులో గంగమ్మ ఒడికి చేరుకున్నారు.ఇక మహానిమజ్జనోత్సవాన్ని కన్నులారా చూసేందుకు కూకట్ పల్లి గ్రామ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.దాంతో కూకట్ పల్లి పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి.ఇక మహాగణపతి శోభాయాత్ర, వీడ్కోలు కార్యక్రమాన్ని భక్తులు స్వయంగా తిలకించి తన్మయత్వం చెందారు.లంబోదరుడి లడ్డూ వేలం పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒకరిని మించి ఒకరు ‘తగ్గేదేలా’ అనే రేంజ్లో పోటీపడ్డారు.కూకట్ పల్లి బీజేపీ కార్యాలయం వద్ద వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో గత 38 సంవత్స రాలుగా ఏర్పాటు చేస్తున్న గణనాధుని సన్నిదానంలో లడ్డు వేలంపాటలో మర్రి కృష్ణారావు 5 లక్షల 25 వేలకు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన లడ్డూ ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.శోభయాత్రలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని అన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది గణేష్ నిమర్జనం ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వినాయక భక్త బృందం సభ్యులు నాయినేని సూర్యప్రకాష్ రావు, ఆర్షణపల్లి సూర్యారావు, చౌదరి సూర్యారావు గొట్టిముక్కల వెంగళరావు, డివిజన్ అధ్యక్షుడు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.




