Tuesday, 3 November 2026

భర్తను చంపేయించి ప్రమాదంగా చిత్రీకరణ

 

పోలీసుల విచారణలో వెల్లడైన నిజం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): బీమా సొమ్ము, ఉద్యోగం కోసం భర్తను హతమార్చిందో ఇల్లాలు. అయితే రెండోపెళ్లి చేసుకుని తనను దూరం పెట్టిన భర్తపై ప్రతీకారంతో ఆమె ఈ పనిచేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పైగా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేస్యా నాయక్‌ (43) పోస్టల్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి నల్గొండ జిల్లా తుత్య తండాకు చెందిన కేతావత్‌ పద్మతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగకపోవడంతో శైలజను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి మొదటి భార్య పద్మ.. కేస్యా నాయక్‌ రెండో వివాహం చేసుకున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని నల్గొండ త్రిపురామ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల నుంచీ భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. కేస్యా నాయక్‌ మూడేళ్ల క్రితం కారును కొని వినోద్‌ను డ్రైవర్‌గా నియమించుకున్నాడు. ఈ నేపథ్యంలోకేస్యానాయక్‌ మొదటి భార్య పద్మ.. భర్తను హత్య చేసేందుకు డ్రైవర్‌ వినోద్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గానూ ముందుగా రూ.15 వేలను డ్రైవర్‌కు ఇచ్చింది. గత నెల 31వ తేదీన వినోద్‌, కేస్యానాయక్‌ను ఎల్బీనగర్‌ చౌరస్తాలో రాత్రి 10:30 గంటలకు కారు ఎక్కించుకుని గుర్రంగూడ సవిూపంలోని ఓ బార్‌కు వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించి రాత్రి 12:30 గంటలకు కారులో తిరిగి బయల్దేరారు. కొద్ది దూరం ప్రయాణించిన తరువాత కారు ముందు సీటులో మత్తులో ఉన్న కేస్యానాయక్‌ను వినోద్‌ గొంతు నులిమి చంపేశాడు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు 100 కి.విూ.ల వేగంతో వెళ్లి కారు ఎడమ వైపు స్తంభానికి ఢీకొట్టాడు. దీంతో స్థానికులు కారు ప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలూ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి డ్రైవర్‌ను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్‌, పద్మలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

——————