Tuesday, 3 November 2026

జగన్‌ కేసుల్లో ఎందుకు చర్యలు తీసుకోరు: వర్ల

విజయవాడ,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధినేత జగన్‌పై 11 ఛార్జిషీట్లు దాఖలైనా ఆయనపై ఇంకా చర్యలు ఎందుకు లేవని ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్‌ను జైలుకెళ్లకుండా రక్షించేందుకు ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఏడు సంవత్సరాల క్రితం జగన్‌పై మొదటి ఛార్జీ షీట్‌ దాఖలైందని, అయినా ఇప్పటి వరకూ విచారణ పూర్తికాకపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీసేందుకే జగన్‌ కేసుల విచారణ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న కేసుని నిర్వీర్యం చేయడానికి గల కారణాలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. దేశంలో జగన్‌ మాదిరిగా ఏ రాజకీయ నాయకుడూ ఇంతటి అవినీతికి పాల్పడలేదన్నారు. రాజకీయ నాయకులపై అవినీతి కేసుల్ని ఏడాదిలోగా విచారణ చేసి శిక్షిస్తామని చెప్పిన మోదీ.. జగన్‌ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని ఇంకా జనంలో ఎలా తిరగనిస్తున్నారని నిలదీశారు.