*భర్త రెండో పెళ్లి చేసుకొని మోసం చేశాడు*
ఆస్తిలో వాటా ఇవ్వకుండా అత్తింటి వారు గెంటేశారు’
ఆత్మహత్యే శరణ్యం అంటు పత్రికల ముందు బోరున ఏడ్చిన మహిళ.
జులై 15(జనం సాక్షి)
మూడుముళ్ల బంధంతో జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త దేశం కానీ దేశానికి తీసుకెళ్లి విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో వెలగొట్టిన సంఘటన కోదాడ పట్టణంలోవెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ జ్యోతి శుక్రవారం కోదాడ పట్టణంలోని పెరిక హాస్టల్ విలేకరుల ముందు తన గోడు వెల్లబోసుకుంది. తన స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామము అని తండ్రి ఎరబోలు వెంకటరెడ్డి వ్యవసాయం చేస్తారని డిగ్రీ చదివిన తనకు కోదాడకు చెందిన ఏనుగు శ్రీనివాసరెడ్డి తో 2009లో వివాహమైందని తెలిపింది . కట్నం గా అయిదు లక్షల నగదు రెండు తులాల బంగారం 10 ఎకరాల భూమి ఇచ్చారని వివాహ అనంతరం ఇద్దరు పిల్లలు అయిన తర్వాత శ్రీనివాసరెడ్డి అమెరికా తీసుకెళ్లి అక్కడ తనకు విడాకులు ఇచ్చి అక్కడే ఉంటూ మరో మహిళను వివాహం చేసుకొని తనను భారతదేశానికి పంపించాడని తెలిపింది. దిక్కుతోచని స్థితిలో తాను కోదాడలోని అత్తవారింటికి వెళ్ళగా వారు కూడా గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త సోదరుడు ఏనుగు సతీష్ రెడ్డి తన కట్నంతో కోదాడలో కొనుగోలు చేసిన ప్లాట్లు ఉమ్మడి ఆస్తి తనకు దక్కనివ్వకుండా అడ్డుపడుతున్నాడని తనపై దాడికి కూడా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. హైదరాబాదులో ఇండ్లు , రత్నవరంలో పొలాలు, కోదాడలో ప్లాట్లు ఉన్నాయని తెలిపింది . తనకు ఆస్తిలో వాటా దక్కకుండా తన భర్త ఫోర్జరీ సంతకాలతో సతీష్ రెడ్డి తన పేరు మీదికి మార్చుకున్నాడని తెలిపింది. ఈ విషయమై 2020 లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించామని సతీష్ రెడ్డి అధికారులకు లంచాలు ఇచ్చి తనకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలతో తాను ఎలా బతకాలని అధికారులు పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని బోరున విలపించింది. అధికారులు పోలీసులు తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వేడుకుంటుంది.