Thursday, 5 November 2026

భారత్‌లో పుట్టిన తొలి పెంగ్విన్‌ 

– వెల్లడించిన ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు
ముంబయి, ఆగస్టు16(జ‌నం సాక్షి) : భారత్‌లో స్వాతంత్య దినోత్సవం రోజున మొట్ట మొదటి పెంగ్విన్‌ పుట్టింది. ముంబయిలోని జూలో బుధవారం తొలి హంబోల్ట్‌ పెంగ్విన్‌ పిల్ల పుట్టిందని బ్రిహాన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ గురువారం ప్రకటన చేసింది. ఆగస్టు 15వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు పెంగ్విన్‌ జన్మించినట్లు అధికారులు తెలిపారు. అదిచాలా యాక్టివ్‌గా ఉందని, తల్లి పెంగ్విన్‌ దానికి ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తోందని జూ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ త్రిపాఠి తెలిపారు. మిస్టర్‌ మోల్ట్‌, ఫ్లిప్పెర్‌ అనే పెంగ్విన్‌లకు ఈ బుల్లి పెంగ్విన్‌ జన్మించినట్లు చెప్పారు. ముంబయి జూలోని అత్యంత వయసు కలిగిన పెంగ్విన్‌ ఫ్లిప్పెర్‌ కాగా, అత్యంత తక్కువ వయసు కలిగిన మగ పెంగ్విన్‌ మోల్ట్‌ అని జూ అధికారులు తెలిపారు. ఫ్లిప్పెర్‌ ఈ ఏడాది జులైలో గుడ్డు పెట్టిందని, దాదాపు 40రోజుల పాటు పొదిగిన తర్వాత బుధవారం పెంగ్విన్‌ పిల్ల పుట్టినట్లు చెప్పారు. జూలో ఫ్లిప్పెర్‌ది ప్రత్యేక ఆకర్షణ అని, దాన్ని చూడడానికి చాలా మంది సందర్శకులు వస్తుంటారని అన్నారు. జూలో పెంగ్విన్‌లు ఉండేందుకు అనువుగా చల్లని, మంచుతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. దాదాపు 1700 చదరపు అడుగుల విస్తీర్ణంలో 16 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ పెంగ్విన్‌ల కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. ముంబయిలో జూలో ఏడు హంబోల్ట్‌ పెంగ్విన్‌లు ఉన్నాయి. డొనాల్డ్‌, డైసీ, పోపియే, ఓలివ్‌, బబుల్‌, ఫ్లిప్పెర్‌, మిస్టర్‌ మోల్ట్‌లను 2016 జులైలో దక్షిణ కొరియా జూ నుంచి తీసుకొచ్చారు. కొరియా నుంచి తెచ్చిన డోరీ అనే మరో పెంగ్విన్‌ ఇన్‌ఫెక్షన్‌తో గత ఏడాది అక్టోబరులో చనిపోయింది.