కుటుంబాన్ని అంతమొందించి ఆత్మహత్య
అలహాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి
అలహాబాద్,ఆగస్ట్21(జనం సాక్షి): భార్య విూద ఉన్న అనుమానంతో భార్యను, ముగ్గురు పిల్లలను ఓ వ్యక్తి హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అలహాబాద్‌లో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ కుష్వాహ అనే వ్యక్తి తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆదివారం రాత్రి భార్యను, తన ముగ్గురు కూతుళ్లను హత్య చేశాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు విరగ్గొట్టి లోనికి ప్రవేశించగా మనోజ్ మృతదేహం సిలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతు కనిపించింది. పోలీసులు ఇంటిని పరిశీలించగా ఓ కూతురి మృతదేహం పక్కగదిలో పడి ఉంది. దాంతో పోలీసులు ఇంటి మొత్తాన్ని సోదా చేయగా ఫ్రిజ్‌లో భార్య మృతదేహం కనిపించింది. గదిలోని అల్మరాలో ఉన్న సూట్‌కేసులో మరో ఇద్దరి కూతుళ్ల మృతదేహలు ఉన్నాయి. స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ భార్యను ఎప్పుడూ అనుమానించేవాడని, వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




