యాదాద్రి,ఆగస్ట్30: భూ వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూ సర్వే జరుగబోతుందన్నారు. దీంతో భూమి రికార్డుల నిర్వహణ, రిజిస్టేష్రన్ విధానం అత్యంత పారదర్శకంగా ఉండనుందన్నారు. 1934లో నిజాం సర్కార్ చేపట్టిన భూముల సర్వే రికార్డులే నేటికి కొనసాగుతున్నాయి. భూమి ఒకరిది అయితే మరొకరి పేరు రికార్డుల్లో ఎక్కడం, పహాణీలో ఒకరి పేరు ఉంటే పాస్ పుస్తకంలో వేరొకరి పేరు ఉండటం, 1బీలో పేరు ఉన్న ఇతర రికార్డుల్ల లేకపోవడం, ఎప్పుడో భూములు అమ్ముకున్న వారి పేర్లే ఇప్పటి వరకు కొనసాగడం తదితర వివాదాలకు పులుస్టాప్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించిందన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ రెవెన్యూ అధికారులకు నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం చర్యలు చేపట్టబోతుంది. ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఒక్కో యూనిట్‌గా పరిగణిస్తారు.
ఆ గ్రామంలో ముగ్గురు అధికారులు భూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామంలోని రైతులందరి సహకారంతో గ్రామసభలు నిర్వహించి భూ రికార్డులను సరిచేస్తారని అన్నారు. ఈ పక్రియ మూడు నెలల్లో ముగిసేలా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకవేళ రైతులకు సంబంధించిన భూముల విషయంలో కోర్టు వివాదాలుంటే కోర్టులు ఇచ్చే తీర్పును అనుసరించి ఆ భూమిపై యజమానిని వీరు నియమిస్తారు. ఆ తర్వాత రికార్డులన్నింటినీ డిసెంబర్ చివరి వరకు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారని వివరించారు. మొదటి దశలో ఎలాంటి వివాదాలు లేని భూముల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి వెంటనే పాస్‌పుస్తకాలను పోస్టు ద్వారా అందిస్తారు. రెండో దశలో వివాదాస్పద భూములకు సంబంధించిన పరిష్కార మార్గాలు చూస్తారు. భూ రికార్డులన్నింటిని సరిచేసిన తర్వాత ఆ వివరాలన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. భూ రికార్డులకు సంబంధించి ఏ చిన్నమార్పు జరిగిన అంతా ఆన్‌లైన్‌లో కన్పించేలా చర్యలు తీసుకోబోతున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులుగా తాము కూడా సర్వేలో పాల్గొంటామనిఎమ్మెల్యే అన్నారు.




