Tuesday, 3 November 2026

మంచి సమాజం కోసం తపించాలి

హైదరాబాద్‌,మే8(జ‌నం సాక్షి): ప్రస్తుత సమాజంలో అనేకులు ఉద్వేగాల్ని పట్టించుకోవడం లేదు. ఉద్రేక భావాలతో సతమతమవుతున్నారు. కఠినంగా మారి జాలి, దయ వంటి రూపాత్మక భావాలకు దూరమవుతున్నారు. మానవీయతను కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. వారిలో నిరాశ నిస్పృహలూ తలెత్తుతున్నాయి. దీంతో అనేక అసాంఘీక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పశుప్రవృత్తి మనుషులను రాక్షసులగా మారుస్తోంది. ఇలాంటి ఘటనలకు చిన్నతనం నుంచే సరైన మార్గం అలవర్చలేక పోవడమే కారణం. మనసు చెప్పింది వినాలి. లేదంటే, మనిషి వాస్తవంతో సంబంధం కోల్పోతాడు. సమస్యల్ని, పరిస్థితుల్ని అవగతం చేసుకోలేడు. తప్పులవిూద తప్పులు చేస్తూనే ఉంటాడు. యథార్థాన్ని గ్రహించలేక అనుచిత నిర్ణయాలు తీసుకొంటాడు. పర్యవసానంగా, అభివృద్ధి కుంటువడుతుంది. సంబంధాలు దూరమవుతాయి. అతడి జీవితమే కకావికలం అవుతుంది.ఆధ్యాత్మిక దర్శనంలో మనోభావాలు చక్కని పాత్ర పోషిస్తాయి. శాంతం లేక సౌఖ్యం లేదన్నాడు త్యాగయ్య. శాంతం అనేది ఒక మనోద్వేగమే!మనిషి కొన్నిసార్లు తనను తాను నిందించు కొంటూ, ఆత్మన్యూనతా భావానికి లోనవుతాడు. కొందరు తమ గురించి తాము గొప్పలు చెబుతూ, ఇతరుల్ని కించపరచాలని ప్రయత్నిస్తారు. మనోద్వేగాల పట్ల మానవుడి నిర్లక్ష్యవైఖరే ఇలాంటి ‘ప్రమాదాల’కు కారణమవుతుంది.మనోద్వేగాలు, పుట్టుకొచ్చే ఊహలు మానవ వ్యక్తిత్వం, ఆలోచనా సరళి, అతడి చుట్టూ గల పరిస్థితులకు అద్దంపడతాయి. అందువల్ల అతడు ఉద్వేగాలు, ఊహల ఉద్భవానికి గల కారణాల్ని గమనించాలి. వాటిని అర్థం చేసుకోవాలి. విశ్లేషణ సాగించాలి. అప్పుడే కోపతాపాలకు, చింతకు, ఈర్ష్యకు ఉన్న కారణాలేమిటో అతడికి తేటతెల్లమవుతాయి. ఆ ఎరుక అతడి జీవితాన్ని స్థిరీకరిస్తుంది. మన పూర్వీకులు తాత్విక చింతన, మంచి అలవాట్లను చేసింది మనుషులు మృగాలు కాకుండా ఉండేందుకే. రానురాను మనవిద్యావిధానంలో, సమాజంలో ఇలాంటి మంచి అన్నది దూరం కావడం వల్లనే అనర్థాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికైనా ఆలోచించి మంచి విద్యావిధానం, మంచి నడవడి నేర్పేలా చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేస్తే మంచి సమాజం ఆవిర్భవిస్తుంది.