మునగాల, మార్చి 24(జనంసాక్షి): మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సాతత్ కిరణ్ పురస్కారలు రావడం అభినందనీయమని ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం కోదాడలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ స్థాయి అవార్డులు దక్కడం గ్రామ పంచాయతీ సర్పంచులు, సభ్యులు చేస్తున్న పనికి నిదర్శనమన్నారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి గ్రామ ప్రజల మన్నలను పొందాలన్నారు. అవార్డులు దక్కించుకున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ లను కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, ఆర్డీవో కిషోర్ కుమార్ లు సన్మానించారు. ఇందులో భాగంగానే మండల వ్యాప్తంగా 22 గ్రామ పంచాయతీలకు గాను 18 గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం సంతోషకరమన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని కేవలం నాలుగు గ్రామాల సర్పంచులకు మాత్రం అవార్డులు రాకపోవడం విచారకరం. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ భూపాల్ రెడ్డి, తహశీల్దార్ జవహర్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




