– 40 క్రితమే అమెరికాకు వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబం ఇక్కడి ప్రజలకు పైసా ఖర్చు సాయం చేశారా..? – ఆకలి తెలిసిన వాళ్లను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : ప్రజాస్వామ్యంలో అల్టిమేట్‌గా ఏది చేయాలన్న ప్రజాప్రతినిధులకే సాధ్యమవుతుందని, అందుకే మన ఆకలి తెలిసిన వాళ్లను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథని పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో బాగంగా నిర్మించిన వంటశాలను మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో జడ్పీ ఛైర్మన్ పాల్గొని మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకం ద్వారానే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. అయితే ఆనాడు అధికారంలో ఉన్న పాలకులు మన ఆకలి, మన బిడ్డల చదువు గురించి ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నతంగా చదివిన వాళ్లే ఉన్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే సైతం ఎల్ఎల్బీ చదవడంతో పాటు ఢిల్లీ యూన్సివర్సీటీలో చదివారని ఆయన గుర్తు చేశారు. ఉన్నతంగా చదివినా మన బిడ్డలకు ఉన్నత చదువులు అందించాలని ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. ఆనాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు బిల్డింగ్ నిర్మాణం చేసి ఐదేండ్లు పడావు ఉండిపోయిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆనాడు మంత్రిగా జిల్లాను శాసించే స్థాయిలో ఉండి ముఖ్యమంత్రిలా వ్యవహరించినా కనీసం బిల్డింగ్ ప్రారంబోత్సవం చేయలేదని విమర్శించారు. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో మన బాగోగులు ఆలోచించే వారు ఉండి ఉంటే ఈనాడు మన దుస్థితి ఇలా ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడి పరిపాలన, ప్రజలతో సంబంధం లేకుండా హైదరాబాద్, అమెరికా చదువుకుని ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలను ఓటు వేసే యంత్రాలుగా బావించే వారి గురించి ఆలోచన చేయాలని అన్నారు. సమాజం మేల్కొపే విధంగా మంచి నాయకత్వం ఎన్నుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతనే జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను ప్రారంభించామని, అంతేకాకుండా విద్యార్దులకు మౌళిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేశామన్నారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, రహదారి సౌకర్యం, బాత్రూంల నిర్మాణాలను చేపట్టిన చరిత్ర తనదేనని అన్నారు. 40 ఏండ్ల తర్వాత డిగ్రీ కళాశాలకు భవనం మంజూరైతే ఎక్కడో దూరంలో నిర్మించారని, ప్రస్తుతం ఆ కళాశాలలో విద్యార్దులు చదువుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మంత్రి పదవి ఉన్నన్ని రోజులు ట్రస్టు సేవలను నడిపించారని, దోచుకున్న పైసలను దానం చేసినట్లు నటించారని, ఆనాడు ట్రస్టు ద్వారా గ్రామంలో ఒక ఎకరం భూమి కొని ఉంటే ఈనాడు డిగ్రి కళాశాల విద్యార్ధులు ఇన్ని కష్టాలు పడేవారా అని ఆయన ప్రశ్నించారు. పేద విద్యార్దులకు ఉన్నత చదువులు అందించాలని ఏనాడు ఆలోచన చేయని ఎమ్మెల్యే ఈనాడు కళాశాలకు పోయి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మన ఊరి నుంచి ఎవరైన విదేశాలకు పోతే అక్కడ సంపాదించిన దాంట్లో కొంతైనా ఊరి కోసమో, బడి కోసమే ఖర్చు చేస్తాడని, కానీ ఎమ్మెల్యే కుటుంబం 40 ఏండ్ల క్రితమే అమెరికాకు పోయి ఇక్కడి పేదోళ్లకు ఎవరికైనా పైసా సాయం చేశాడా అని ఆయన దుయ్యబట్టారు.
మంత్రి పదవి ఉన్నన్ని రోజులే ట్రస్టు సేవలు నడిపించండ్రు




