మంత్రులు పేర్ని నాని, కొడాలిలకు నిరసన
థియేటర్ ప్రారంభానికి రాగా నిలదీసిన పవన్ అభిమానులు
విజయవాడఫిబ్రవరి25( జనం సాక్షి): రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని,పేర్ని నాని పాల్గొన్నారు. ప్రారంభ చిత్రంగా థియేటర్లో భీమ్లా నాయక్ ప్రదర్శించనున్నారు. కాగా థియేటర్ వద్ద మంత్రి పేర్ని నానిని అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున అభిమానులు నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమని అభిమానులు మండిపడుతున్నారు. ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం అన్యాయమని జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.