రైతులకు బీమా చేయించేందుకు దరఖాస్తు ఫారాల పంపిణీ
నేటినుంచి జిల్లాల్లో మళ్లీ రైతులతో భేటీ
హైదరాబాద్,జూన్6(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు, మండల కన్వీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈమేరకు కలెక్టరేట్‌లో జిల్లాలోని వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతు బీమా వివరాల సేకరణకు అవసరమైన సామగ్రిని అందజేయనున్నారు. దీంతో గురువారం నుంచి అధికారులు రైతుల వివరాలు సేకరించేందుకు ప్లలెబాట పట్టనున్నారు. ఇప్పటికే పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులు పంపిణీ చేసిన అధికారులు రైతుల ఆధార్ నంబర్లను సేకరించారు. బీమా పథకంలో నామిని పేరు నమోదు చేయాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివరాలు సేకరించేందుకు సన్నద్ధమయ్యారు. రైతన్నలందరికీ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే కుటుంబం వీధిన పడకుండా ఈ బీమా డబ్బులు సదరు కుటుంబానికి అందుతాయి. బీమా పరిహారం రూ.5లక్షలు ఉంటుంది. పట్టాదారు పాసుబుక్కులు ఉన్న రైతులంతా ఈ పథకానికి అర్హులు. రైతులు 15 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు వారై ఉండాలి. 15-08-2018 నుంచి 14-08-2019 వరకు అంటే ఏడాది ఈ బీమా అమలులో ఉంటుంది. ఏడాదికోసారి బీమా పథకాన్ని పున్ణరుద్ధరిస్తారు.ఆధార్‌కార్డులో ఉన్న పుట్టిన తేదీ ప్రకారం రైతుల వయస్సు లెక్కిస్తారు. ఒకవేళ పట్టిన తేదీ లేకపోతే జూలై 1ని పుట్టిన తేదీగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పట్టాదారుడి ఆధార్ నంబర్, పాసుపుస్తకం నెంబరు, మొబైల్ నెంబరు, ఒకవేళ చనిపోతే డబ్బులు ఎవరికి చెల్లించాలో తెలిపే నామిని పేరు, నామిని ఆధార్, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలతో పాటు రైతు స్వయంగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరిన ప్రతి ఒక్క పట్టాదారుడికి ఆగస్టు15 తర్వాత ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్ జారీ చేస్తుంది. గురువారం నుంచి అధికారులు నామిని వివరాలతో పాటు అర్హులైన రైతుల వివరాలను అన్ని మండలాల్లో ఏఈవో క్లస్టర్‌ల వారీగా ఏఈవోలు రైతుల వద్ద సేకరించనున్నారు. ఎల్‌ఐసీ, వ్యవసాయ శాఖ ముద్రతో కూడిన దరఖాస్తు ఫారాలు ఇప్పటికే అధికారులకు అందాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అధికారులకు దిశానిర్దేశర చేశారు. మరోవైపు దీనికి సంబంధించి రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు సైతం అధికారులకు సాయం అందించనున్నారు. ఈ పక్రియ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారం నుంచి పదిరోజుల వ్యవధిలో ఈ పక్రియ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయవద్దని, వర్షాలు పడితే రైతులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెబుతున్నారు.




