హైదరాబాద్: ఢిల్లీసీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో ఖాళీగా ఉన్న పోస్టులను బీహార్ నుంచి తీసుకువచ్చిన పోలీసులతో పూరించడంతో మరల విభేదాలు పొడచూపాయి. ఢిల్లీ ఏసీబీ తన పరిధిలో కొనసాగుతుందని కేంద్ర హౌంశాఖ ప్రకటించిన తర్వాత కూడా సీఎం ఎలా ఏసీబీ ఖాళీలను భర్తీ చేస్తారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ఏసీబీలో ఖాళీగా ఉన్న, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో అధికారుల్ని పంపించాల్సిందిగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌ని కేజ్రీవాల్ కోరారు. దానికి నితీష్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే, ఢిల్లీలో అవినీతి రహిత పాలన అందించేందుకు 24 ఇన్‌స్పెక్టర్లతో సహా 600 మంది అధికారుల్ని నియమించేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న లెఫ్టినెంట్ గవర్నర్ తనకున్న విశేష అధికారాలతో వారి నియామకాలకు అడ్డు చెప్పాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో కేజ్రీవాల్, నజీబ్‌జంగ్‌ల మధ్య వివాదం మరోమారు తెరపైకి వచ్చింది.




