Thursday, 5 November 2026

మహానటితో మళ్లీ నాకు ప్రాణం పోశారు: మోహన్‌ బాబు

హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు ‘మహానటి’ సినిమాలో ఎస్వీ రంగారావుగా ఓ మెరుపు మెరిశారు. ఆయన పాత్ర నిడివి కొంతసేపే అయినా ప్రేక్షకులపై దాని ప్రభావం బాగా పడింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చి.. ప్రేక్షకులతో ‘శభాష్‌’ అనిపించుకునేలా చేశారని ఆనందం వ్యక్తం చేశారు.
‘అశ్వినీ దత్‌ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలు ఇద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడకుండా సావిత్రి గారి జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్ర ఇచ్చి.. ‘శభాష్‌’ అనిపించుకునేలా చేశారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శక, నిర్మాతలకు దక్కుతుంది. ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లూ ప్రసాదించాలని, వారు ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని ఆశీర్వదిస్తున్నాను’ అని మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. ‘మహానటి’ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో దర్శక, నిర్మాతలు వేడుకలు జరుపుకొన్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కేక్‌ కట్‌ చేశారు. చిత్ర బృందం ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్‌విూడియాలో వైరల్‌గా మారింది.
———–