ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ చేస్తే వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయండి
సైబరాబాద్ తూర్పు సీపీ మహేష్ భగవత్
హైదరాబాద్: మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, బాధితులు తమ వాట్సప్ నెంబరు 94906 17111 ద్వారా ఏ సమయంలో అయినా ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ కమిషనరేట్ తూర్పు సీపీ మహేష్ భగవత్ సూచించారు. నాగోల్ అల్కాపురి చౌరస్తా సమీపంలోగల ఎల్‌బీనగర్ ట్రాఫిక్ పోలీస్ కార్యాలయ ఆవరణలో ఉన్న సీపీ క్యాంపు కార్యాలయంలో బాధితుల నుంచి మంగళవారం వినతిపత్రాలు తీసుకున్నారు. ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫిర్యాదుదారులు వచ్చినపుడు వారితో మర్యాదగా మెలగాలని పోలీసు సిబ్బందికి సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమస్యలను చెప్పేందుకు మహిళలు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారని సీపీ తెలిపారు. వారి రక్షణకు భరోసా ఇస్తున్నామన్న అభిప్రాయం కల్పించాలన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే తమను సంప్రదించవచ్చన్నారు. సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రతి మంగళవారం, మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేస్తే న్యాయం లభిస్తుందన్నారు.




