Wednesday, 4 November 2026

మహిళల మృతిపై దర్యాప్తు ముమ్మరం

గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): మృతిచెందిన మహిళలు కూలీలై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం వారు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి ముఖాలతో ఉన్న ఫోటోలను తీయించి పరిసర ప్రాంతాలలో వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.శ్రీనివాస్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. మూసీనదిలో ఇద్దరు గుర్తు తెలియని మహిళల మృతదేహాలు లభించడం లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం సాయంత్రం కలకలం రేపింది. ఈ ఇద్దరి తలలకు తీవ్ర గాయాలున్నాయి. ఆసిఫ్‌నగర్‌ ఇన్‌చార్జి ఏసీపీ ఎం.నరేందర్‌ రెడ్డి వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్‌ విూదుగా వెళ్లే మూసీనదిలో అత్తాపూర్‌ వైపు అంబియన్స్‌ ఫోర్ట్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని మహిళల మృతదేహాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆకుకూరలు పండించే వారు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.శ్రీనివాస్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ యాదగిరిగౌడ్‌లు తమ ఎస్‌ఐలు బాలస్వామి, కవి ఉద్దీన్‌, రవీందర్‌లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. మూసీలో నుంచి మహిళల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం క్లూస్‌ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కొద్ది సేపటి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌చార్జి ఏసీపీ ఎం.నరేందర్‌ రెడ్డి మృతదేహాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళల తలపై తీవ్రగాయాలు, వెన్నుముక కింద భాగంలో గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు.మూసీలో లభించిన మహిళల మృతదేహాలను పరిశీలించిన పోలీసులు వారిద్దరికి 45 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఒకరికి కుడికంటిపై భాగంలో, తలపై తీవ్రగాయాలు ఉన్నాయి. మరొకరి తలపై తీవ్రగాయాలు ఉండటంతో వారిని కొట్టి చంపినట్లు పోలీసులు భావించారు. మృతదేహాలు మూసీలో పెరిగే పిచ్చిమొక్కల కింద దొరకడంతో ఇది కచ్చితంగా హత్యేనన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరైనా మహిళలు తప్పిపోయిన వారు ఉంటే చెప్పాలని కూడా సూచించారు.