శేరిలింగంపల్లి, అక్టోబర్ 08( జనంసాక్షి): లారీ దొంగతనానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇరువురు దొంగలను మాదాపూర్ జోన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. మాదాపూర్ జోన్ అడిషనల్ డిసిపి ఎన్. నరసింహ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా దుండిగల్ కి చెందిన నార్ల మల్లేష్ అలియాస్ నార్ల అలియాస్ నల్లమల్లేష్ అలియాస్ చిన్న అలియాస్ చంటి(32), మియాపూర్ పరిధి న్యూ కాలనీకి చెందిన మూడావత్ శ్రీను అలియాస్ సామ్య32) ఇరువురు గత నాలుగు సంవత్సరాలుగా మియాపూర్ న్యూ కాలనీ లో ఉంటూ వ్యక్తిగత పనులు చేసుకునేవారు. అయితే కూలీ డబ్బులను జల్సాలకు వాడుతుండడంతో వ్యసనాలకు బానిసలుగా మారి సులువుగా డబ్బులు సంపాదించడానికి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో 2010 నుండి 2014వ సంవత్సరం వరకు నార్ల మల్లేష్ 9 కేసులలో నిందితునిగా పాల్గొన్నారు. అయితే వీరి జల్సాలకు డబ్బు అవసరమై ఏదైనా దొంగతనానికి పాల్పడాలన్న ఆలోచనలో ఉండగా ఈనెల 1వ తేదీన న్యూ కాలనీ శివాలయం టెంపుల్ వద్ద పార్క్ చేసిన లారీని దొంగిలించి దాన్ని అమ్మేందుకై ప్రయత్నిస్తున్నారు. కాగా ఇదే విషయంలో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు కేసును సవాల్ గా స్వీకరించి స్పెషల్ క్రైమ్ టీం నేతృత్వంలో దర్యాప్తును వేగవంతం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాచుపల్లి పరిధి 7 హిల్స్ దాబా వద్ద లారీ ఉన్న విషయాన్ని గమనించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




