Monday, 2 November 2026

మామూలు ఇవ్వలేదని కొట్టి చంపారు..

భావ్‌నగర్‌: ఇల్లు కొనుక్కున్న ఓ వ్యక్తిని ఆ సందర్భంగా తమకు కొంత డబ్బివ్వమని వేధించారు కొందరు యువకులు. ఇవ్వలేనని చెప్పిన అతడిని 8 మంది వెంటాడి, దారుణంగా కొట్టి చంపేశారు. ఈ అమానుషం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన సమీపంలోని సెక్యూరిటీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వీధిలో రాత్రి పూట దాదాపు ఎనిమిది మంది 17 నుంచి 19ఏళ్ల మధ్య వయసున్న యువకులు రఫీక్‌ హుస్సేన్‌ అనే వ్యక్తిని వెంటాడారు. పరిగెత్తుతూ కిందపడిపోయిన అతడి మీద కర్రలు, రాడ్లతో దాడిచేసి కొట్టారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

కూరగాయల వ్యాపారం చేసుకునే రఫీక్‌ హుస్సేన్‌ ఇటీవల రూ.25లక్షలకు ఇంటిని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి కొందరు యువకులు తమకూ డబ్బు ఇవ్వమంటూ రఫీక్‌ను బెదిరిస్తున్నారు. తాను రుణం తీసుకుని ఇల్లు కొన్నానని, తన వద్ద డబ్బు లేదని, ఇవ్వలేనని రఫీక్‌ చెప్పడంతో అతడిపై దాడి చేసి కొట్టి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో కొందరిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్‌ పోలీసు అధికారి దీపాంకర్‌ త్రివేది వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *