ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేలా కార్యక్రమం
హైదరాబాద్,ఆగస్ట్15(జనం సాక్షి): వ్యాధి నిరోధక టీకాలైన మిజిల్స్, రుబెల్లా తదితర వ్యాక్సిన్ల ద్వారా వ్యాధినివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. నెలల నుంచి 15 ఏళ్లలోపు వయస్సుగల పిల్లలకు మిజిల్స్, రుబెల్లా, తట్టు టీకాలను వేయించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. గతంలో వేయించిన పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అదనపు డోసును వేయించవచ్చని వైద్యాధికారులు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా దవాఖానలు, ప్రసూతి కేంద్రాల్లో ఉచితంగా ఈ టీకాలను వేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు వివిధ జిల్లాలకు చెందిన వైద్యాధి కారులు విస్తృత ప్రచారం జరుపుతున్నారు. వ్యాక్సినేషన్‌పై సవిూక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాల వైద్యయంత్రాంగం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలతో పాటు జిల్లా వైద్యాధికారులు వ్యాక్సినేషన్ పై ప్రచారం జరుపుతున్నారు. జిల్లాల్లోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, బస్తీల్లో పోస్టర్లు, కరపత్రాలతో పాటు అవగాహన సదస్సుల ద్వారా టీకాలపై ప్రచారం, అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధులు వచ్చిన తరువాత దవాఖానలకు పరుగెత్తడం కంటే రోగాలు రాకుండా ముందుజాగ్రత్త పడడమే ఉత్తమమని, అందుకోసం వ్యాధినిరోధక శక్తిని పెంచే టీకాలు వేయించాలని వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మిజిల్స్, రుబెల్లా టీకాలు వేయడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటుందని పలు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చెబుతున్నారు. వ్యాధులు రాకుండా ముందస్తు వ్యాక్సినేషన్ చేయించుకోవడం, ఒక వేళ రోగాలు వ్యాపిస్తే వాటిని ప్రారంభదశలోనే గుర్తించి, సరైన చికిత్స చేయడం తదితర వాటిపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ టీకాల వల్ల ఎలాంటి దుష్పభ్రావాలు ఉండవని, వాటిపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోనవసరంలేదని
వైద్యాధికారులు స్పష్టం చేశారు. గతంలో వేయించుకున్నవారు మళ్లీ వేయించుకోవచ్చని సూచిస్తున్నారు.




