మిర్యాలగూడ జిల్లా సాధన జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్ గా జాడి రాజు మాలోతు దశరధ నాయక్:
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) కన్వీనర్ గా ప్రముఖ వైద్యులు జాడి రాజు,కో కన్వీనర్ గా బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్ లు ఎన్నికయ్యారు. మిర్యాలగూడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ గత కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతుండగా ఇప్పటి నుండి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈసందర్భంగా డాక్టర్ రాజు దశరథ నాయక్ లు మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో అన్ని రాజకీయ పక్షాలు,ప్రజా సంఘాలు,వ్యాపార,వాణిజ్య సంఘాలతో పాటు వివిధ వర్గాల ప్రజలు,ఉద్యోగ,ఉపాధ్యాయులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రాజకీయ పార్టీల నాయకులు, అనుబంధ సంఘాలు యువజన,విద్యార్థి, మహిళ సంఘాల నాయకులను కోఆర్డినేటర్లుగా నియమించుకొని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడను జిల్లాగా సాధించుకుంటామని తెలిపారు. జిల్లా ఏర్పాటు ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగ,ఉపాధ్యాయులు సహకరించాలని పిలుపునిచ్చారు.