గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ ఆగస్టు 21 (జనం సాక్షి): ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో పెద్ద ముత్యాలమ్మ పండుగ సందర్భంగా ముత్యాలమ్మ గుడిలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిరజిత సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ముత్యాలమ్మ పండుగ నిర్వహించడం అనాదిగా వస్తుందని ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోవడంతో గ్రామంలో ప్రజల ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో శుభం కలుగుతాయని ప్రజల విశ్వాసం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగల్లో భాగస్వామ్యం అయి ప్రజల నమ్మకాలకు విశ్వాసాలకు అండగా ఉంటుందన్నారు. ముత్యాలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి అన్నారు. గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతి అని అన్నారు. ప్రజలు ముత్యాలమ్మ పండుగ ను ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, హరిబాబు, కుంట సైదులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




