Thursday, 5 November 2026

రైతుల కళ్ళల్లో ఎన్నడూ లేని ఆనందం

ఉత్సాహంగా చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ
కాంగ్రెస్‌, బిజెపిల విమర్శలను తిప్పికొట్టిన టిఆర్‌ఎస్‌
హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి ): తెలంగాణలోని రైతుల కళ్లలో ఇప్పుడు కనిపిస్తున్న ఆనందం గతంలో ఎప్పుడూ లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ ఉత్సాహంగా సాగుతోందని కర్నె ప్రభాకర్‌ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ రైతుల కళ్లలో ఉన్న ఆనందం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్‌, బీజేపీ హేళన చేయడాన్ని కర్నె ఖండించారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ నేత మారెడ్డి శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుబంధు పథకం రైతులకు భరోసా ఇస్తోందన్నారు. గతంలో నీటి తీరువా బకాయిల కోసం, భూమి శిస్తు వసూలు కోసం గ్రామాల్లో ఇంటి దర్వాజాలు లాక్కెళ్లిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రైతు
దగ్గరికే పాస్‌ బుక్కులు, చెక్కులు వస్తున్నాయని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు ఉరికొయ్యలే మిగిలాయని ఎమ్మెల్సీ కర్నె విమర్శించారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌ దారిలోనే పయనిస్తోందన్నారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా బీజేపీ వైఖరి ఉందని మండిపడ్డారు. కేంద్రం రైతులకు ఏవిూ చేయదని, చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని తప్పుపట్టారు. రైతుబంధు పథకం మద్యం వ్యాపారులకే పనికొస్తుందని బీజేపీ నేతలు మాట్లాడటం తెలంగాణ రైతులను కించపరచడమేనని కర్నె అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రైతాంగానికి వెంటనే క్షమాపణ చెప్పాలని కర్నె డిమాండ్‌ చేశారు. లేకుంటే రైతాంగం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు కూడా మధ్యం తాగించడానికేనా అని బీజేపీ నేతలను నిలదీశారు.
కర్ణాటకలో కూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టిందని ఎమ్మెల్సీ ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో బీజేపీ రైతులకు ఇచ్చిన హావిూ కూడా మద్యం అలవాటు పెంచడానికేనా? అని ప్రశ్నించారు. సంకుచిత ధోరణితో మాట్లాడుతున్న బీజేపీని రైతులు కచ్చితంగా నిలదీస్తారని హెచ్చరించారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీలు వేల కోట్లు బ్యాంకులను ఎగ్గొట్టి పారిపోతే బీజేపీ నేతలు కళ్ళు అప్పగించి చూశారని కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. వాళ్ళు ఎగ్గొట్టిన మొత్తం కంటే తక్కువను రైతులకు సాయం అందిస్తుంటే బీజేపీ నేతలకు ఎందుకు కడుపు మంట అని నిలదీశారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు కోల్పోయాయని వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారని, మద్దతు ధర కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అన్నారు. కేంద్రం చేయకుంటే రాష్ట్రం కూడా ఏవిూ చేయొద్దని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్లుందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని తాము పథకాలు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు వాటిని వద్దంటున్నారని చెప్పారు.
————-