Wednesday, 4 November 2026

మూలమలుపు మహత్యం… బొగ్గు టిప్పర్ బోల్తా

– తప్పిన పెనుప్రమాదం
చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్ట్  20) : మండలంలోని    ఆయన పాలెం, మద్దుకూరు,  చండ్రుగొండ  మూలమలుపు లు  ప్రమాదాలకు  కేరాఫ్ గా   మారాయి.   నిత్యం రద్దీగా ఉండే చండ్రుగొండ ప్రధాన కూడలిలో  అత్యంత ప్రమాదకరమైన మూలమలుపు స్థానిక ప్రజలకు శాపంగా మారింది. బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్థులు  ఏ క్షణాన ఎటువంటి ప్రమాదం పొంచి ఉందోనని  భయాందోళన పడుతున్నారు. మూలమలుపు ప్రమాదాలు  ఈ మధ్య కాలంలో కాస్త తగ్గినా  తాజాగా  శనివారం తెల్లవారుజామున  జరిగిన  బొగ్గు టిప్పర్ ప్రమాదం ఎప్పటికైనా  ప్రమాదం పొంచి ఉందని  హెచ్చరిస్తుంది. జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరగక పోగా  మలుపు వద్ద ఉన్న షాపులు  స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభం విరిగి పడటంతో  విద్యుత్ శాఖాధికారులు  అప్రమత్తమయ్యారు.  చండ్రుగొండ ప్రధాన సెంటర్ లో  వృత్తాకారంలో ఉన్న మలుపు  వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. అదే   ప్రమాదం  పట్టపగలు జరిగితే  పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే  అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత   అధికారులు మలుపుల వద్ద  ప్రమాద సూచికలు నిదానంగా మలుపు తిరిగేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టాలని   అమాయక ప్రజల ప్రాణాలకు  రక్షణ కల్పించాలని  గ్రామస్తులు కోరుతున్నారు.