Thursday, 5 November 2026

మెట్రోరైల్‌ ప్రారంభించగానే ట్రాఫిక్‌ సమస్య తీరదు

 

ఫస్ట్‌ మైల్‌ నుంచి లాస్ట్‌ మైల్‌ వరకు కనెక్టివిటీ ఉండాలి

సరికొత్త ఆలోచనలతో మెట్రోను ఆధునీకరిస్తున్నాం

స్టేషన్‌ల వద్ద ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ సేవలు

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌9(జనం సాక్షి ) : మెట్రో రైల్‌ ప్రారంభించగానే ట్రాఫిక్‌ సమస్య తీరదని, ఫస్ట్‌ మైల్‌ నుంచి లాస్ట్‌ మైల్‌ వరకు కనెక్టివిటీ ఉండాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. శనివారం ప్రభుత్వం, మెట్రో రైల్‌, ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో స్టేషన్‌ యాక్సెస్‌ అండ్‌ మొబిలిటీ చాలెంజ్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మెట్రో ఎండీ మాట్లాడుతూ మెట్రోకి అనుగుణంగా పార్కింగ్‌, రవాణా సౌకర్యం ఉండాలన్నారు. డబ్ల్యూఐ, టొయోటా మొబిలిటీ ఫౌండేషన్‌తో కలిసి సరికొత్త ఆలోచనలతో మెట్రోను ఆధునీకరిస్తామని చెప్పారు. స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ సేవలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో మియాపూర్‌లో ఎలక్టిక్రల్‌ చార్జింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో అనుసంధానం కోసం సృజనాత్మక పరిష్కారాలను చూపే వేదిక స్టాంప్‌. స్టాంప్‌ కార్యక్రమానికి ఐఐటీ, సీఐఐ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు నిర్మించాం. స్టార్టప్‌ సంస్థలు మంచి ఆలోచనలతో వస్తే మౌలిక వసతులు కల్పిస్తామని వివరించారు.హైదరాబాద్‌ మెట్రో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుందని జయేశ్‌ రంజన్‌ అన్నారు. స్టాంప్‌ ఛాలెంజ్‌తో.. హైదరాబాద్‌ మెట్రో సేవలు మరింత అత్యాధునికం. స్టార్టప్స్‌, ఇన్నోవేషన్స్‌, క్రియేషన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారిందని రంజన్‌ పేర్కొన్నారు.