Thursday, 5 November 2026

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

75,631 మందికి చేప ప్రసాదం అందజేత

హైదరాబాద్‌, జూన్‌9(జనం సాక్షి ) : నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా కొనసాగింది. దూద్‌బౌలిలోని హరినాథ్‌గౌడ్‌ ఇంటి వద్ద ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. పంపిణీ సందర్భంగా మూడువేల మంది అధికారులు, సిబ్బంది సేవలందించారు. ఇప్పటి వరకు 75,631 మంది చేప ప్రసాదం స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది 60వేల మంది చేపప్రసాదం స్వీకరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది, వాలింటీర్లకు మంత్రి తలసానిశ్రీనివాస్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తిరుగు ప్రయాణంలోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్‌, కాచిగూడ, ఎంజీబీఎస్‌ తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేపమందు కోసం తరలివచ్చారు. తరలివచ్చారు.