Monday, 2 November 2026

మే31లోగా విద్యా వాలెంటీర్ల నియామకం

హైదరాబాద్‌,మార్చి28(జ‌నంసాక్షి): వచ్చే విద్యా సంవత్సరం జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యావంలంటీర్లను ఆలోగానే నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన విద్యావాలంటీర్ల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ టీ విజయ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. నోటిఫికేషన్‌తోపాటు షెడ్యూల్‌ విడుదలచేసి మే 31 నాటికి నియామకాలు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా విద్యావాలంటీర్ల నియామకానికి ఖాళీల వివరాలు డీఈవోలు ఈ నెల 31లోగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని తెలిపారు. పాఠశాలల వారీగా ఏర్పడిన ఖాళీలు, పదవీ విరమణ వివరాలను పంపించాలన్నారు. విద్యావాలంటీర్ల నియామక నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15వేల మందికిపైగా నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం గత సంవత్సరం విద్యావాలంటీర్ల జీతాలను రూ.12వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో వంలంటీర్లుగా పనిచేసేందుకు పలువురు పోటీ పడుతున్నారు.