Tuesday, 3 November 2026

మోడీకి కేసీఆర్‌ చెంచాలా మారాడు

– టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది
– ప్రధాని వద్ద ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్‌పై ఎందుకు ప్రస్తావించలేదు?
– ముస్లీంలను కేసీఆర్‌ మభ్యపెడుతున్నాడు
– టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే
– తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– ముస్లిం రిజర్వేషన్‌ కోసం కాంగ్రెస్‌ పోస్టుకార్డు ఉద్యమం
– రిజర్వేషన్‌లు కల్పించాలని అబిడ్స్‌ వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌, జులై2(జ‌నం సాక్షి ) : ముస్లిలకి 12 శాతం రిజర్వేషన్‌ నాలుగు నెలల్లో ఇస్తామని చెప్పిన కేసీఆర్‌.. ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ టి.కాంగ్రెస్‌ నేతలు పోస్ట్‌ కార్డ్‌ ఉద్యమం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా సోమవారం గాంధీభవన్‌ నుంచి అబిడ్స్‌ జీపీవో వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ మైనారిటీ చైర్మన్‌ జవేద్‌, కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు. ముస్లింలకు సీఎం ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గాంధీభవ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లు నాలుగు నెలల్లో కల్పిస్తామనిచెప్పిన కేసీఆర్‌ నాలుగేళ్లయిన 12శాతం రిజర్వేషన్‌ కల్పించలేదని అన్నారు. ముస్లింలకు ఇచ్చిన హావిూని నెరవేర్చే వరకు ఓట్లు అడిగే తెరాసకు లేదన్నారు. మొన్న మోడీని కలిసినప్పుడు.. ముస్లిం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్‌.. ట్విట్టర్లో మాట్లాడటం కాదని, రిజర్వేషన్‌ విూద మాట్లాడితే బాగుంటుందని ఉత్తమ్‌ హితవు పలికారు. ఆలేరులో జరిగిన ఎన్కౌంటర్‌ పై కనీసం విచారణ అయినా చేయరా అంటూ ప్రశ్నించారు. మక్కా కేసులో అందరూ నిర్దోషులు అయితే.. దోషులు ఎవరని ప్రశ్నించారు. ఉర్దూ ఆకాడమిని ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చెయలేదని, మైనార్టీలకు బడ్జెట్లో రూ. 6.75 లక్షల కోట్లు కేటాయించి… రూ. 3 వేల కోట్లు ఎందుకు విడుదల చేశారు అంటూ ఉత్తమ్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై విరుచుకు పడ్డారు. అలాగే.. కేసీఆర్‌ సీఎం అయ్యాక.. మైనారిటీ విద్యాసంస్థలు మూత పడ్డాయని… షాది ముబారక్‌ స్కీంకి నిధులు లేవని.. పెళ్లికి డబ్బులు అందాల్సింది పోయి.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా డబ్బులు రావటం లేదని ఆయన మండిపడ్డారు. మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెంచాలా మారాడని ఉత్తమ్‌ ఆరోపించాడు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని గుర్తించాలంటూ ప్రజలకు సూచించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంకి ఓటేసినా….బీజేపీకి వేసినట్టేనని.. ఈ విషయంలో మైనారిటీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎంఐఎం కాంగ్రెస్‌ మద్దతుతోనే పెరిగిందని.. ఇప్పుడు కాంగ్రెస్‌ కి ద్రోహం చేసిందని వెల్లడించారు. బీజేపీతో..ఎంఐఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని.. 2014 వరకు ఓల్డ్‌ సిటీలో తాము బలహీనమైన అభ్యర్థులను పెట్టామని.. ఇక 2019లో బలమైన అభ్యర్థులను బరిలో
పెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కుంతియా, తదితరుల పాల్గొన్నారు.