రాంమాధవ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్,జూలై6(జనం సాక్షి ): టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బిజెపి యాత్రల పేరుతో కేవలం టిఆర్‌ఎస్‌ను విమర్శించడామే పనిగా పెతట్టుకుందని టిఆర్‌ఎస్ నేతలు మండిపడు తున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మగతనం లేదన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏపాటిదో గతంలో జరిగిన ఎన్నికల్లోనే తేలిపోయిందని ఆర్మూర్ మ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు రాంమాధవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత రాంమాధవ్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మగతనం గురించి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సంఘ్‌లో పనిచేశానని చెప్పుకునే రాంమాధవ్ మాట్లాడాల్సిన భాష ఇదేనా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణలో కమలం పువ్వు ఎప్పుడో వాడిపోయిందని జీవన్‌రెడ్డి ఎద్దేవా
చేశారు. కేటీఆర్‌పై రాంమాధవ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇకపోతే నచైతన్య యాత్రలో భాగంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆగ్రోస్ ఛైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు తెలిపారు. బస్సు యాత్ర పేరుతో టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసన్నారు. అన్ని మతాలు, కులాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. పారదర్శకతకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు. దేశంలోనే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్. కేంద్ర మంత్రులే కేటీఆర్ పనితీరును మెచ్చుకుంటున్నారని కిషన్‌రావు వివరించారు. అయితే ఇవన్నీ విస్మరించి విమర్శలు చేయడం దారుణమని అన్నారు.




