Tuesday, 3 November 2026

యాదాద్రిలో కార్తీక సందడి

యాదాద్రి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): శుక్రవారంనుంచి మొదలయ్యే కార్తీకమాసంలో యాదాద్రి నారసింహుడి సమక్షంలో ప్రత్యేక పూజలకు రంగం సిద్దం చేశారు. భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. కార్తీకంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణ చేయనున్నారు. అలాగే దైవదర్శనాల సదుపాయాలు కల్పించేందుకు యాదాద్రి దేవస్థానం సన్నద్ధమైంది. వ్రతమొక్కులు తీర్చుకునేందుకు భక్తజనులు అత్యధికంగా రానుండడంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అదనపు సిబ్బందితో ఏర్పాట్లు చేపట్టనున్నామని ఆలయ ఈవో గీత తెలిపారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా నవంబర్‌ 4న అదనపు ఏర్పాట్లతో వ్రతాల నిర్వహణ జరుగుతుంది. ఆరోజు ప్రత్యేక అలంకరణలు, ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా పలుదఫాలుగా వ్రతాలను నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 5 నుంచి ప్రతి రెండుగంటలకోసారి వ్రతాల నిర్వహణ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆకాశదీపం వెలిగిస్తారు. దీపాల అలంకరణతో దీపోత్సవాన్ని నిర్వహిస్తారు.

అనుబంధంగా కొనసాగుతున్న శివాలయం, పాతగుట్టలోనూ దీపోత్సవాలు నిర్వహిస్తారు.

ఇకపోతే కార్తీకంలో నెలరోజులపాటు మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కొనసాగుతాయి. వ్రతాల టిక్కెట్లు ఖరీదు చేసి మండపంలో చేరగానే పూజాసామగ్రి వ్రతపీటల వద్దకు చేరుస్తారు. వ్రతమంపడం, దైవదర్శనాల కోసం వేచియుండే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పిస్తారు. ప్రసాదాల కొనుగోలుకు ఆటంకం కలగకుండా ప్రత్యేక వరుసలు, అదనపు కౌంటర్లు ఏర్పాటవుతాయి. ఆరోజు ఉదయం 6:30 నుంచి ఉ.8:30 వరకు శతఘటాభిషేకం నిర్వహిస్తారు. నిజాభిషేకం, అర్చన నిర్వహణ వేళల్లో మార్పులు చేశారు.