Thursday, 5 November 2026

రైతుబంధు చారిత్రాత్మక కార్యక్రమం

దేశంలోనే ఎవరూ ఊహించని పథకం
వ్యవసాయశాఖ మంత్రి పోచారం
హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం రాష్ట్ర వ్యవసాయరంగంలో ఒక చారిత్రాత్మకమైన మలుపు అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రైతులకు ముందస్తు పెట్టుబడి సమకూర్చడం ప్రపంచంలోనే మొదటిసారి అని, సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిఒక్కరినీ ఆకర్షించిందని తెలిపారు. రైతుబంధు పథకం అమలుకు సంబంధించి ఆయన  ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో 58.34 లక్షల మంది రైతులకు 1.43 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందజేయనున్నట్టు తెలిపారు. రైతుబంధు పథకం కోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించామని, రెవెన్యూశాఖ భూప్రక్షాళనలో భాగంగా పార్ట్‌ ఏ కింద 93 శాతం భూములకు ఈ పథకం అమలుచేస్తున్నట్టు తెలిపారు.ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి ఈ నెల 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు పంపిణీని చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని, పథకం పూర్తయ్యేవరకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.  రైతుబంధు చెక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను కలిపి పంపిణీ చేస్తామని, ఇప్పటికే ఇవి మండలాలకు చేరాయని చెప్పారు. చెక్కుల పంపిణీ కోసం ప్రతి 300 మంది రైతులకు ఒక టీంను ఏర్పాటు చేశామని, జిల్లాల్లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇబ్బందులు లేకుండా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం అనేకపథకాలను అమలుచేస్తున్నదని పోచారం వెల్లడించారు. అధికారులు
గ్రామ పహాణీ ప్రతి తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. రైతులకు ముందుగానే పాస్‌పుస్తకాలు, చెక్కులకు సంబంధించిన స్లిప్‌లు పంపిణీ చేయాలన్న మేరకు కార్యక్రమం అమలు జరిగిందన్నారు.
ఒకవేళ స్లిప్‌లను అందించలేకపోతే ఏ కారణంతో ఇవ్వలేకపోయారో లిస్ట్‌ను తయారుచేసి, అందుబాటులో ఉంచుకోవాలి. గ్రామంలో పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేసే స్థలంలో 300 కంటే ఎక్కువమంది రైతులు వస్తే అదనపు కౌంటర్లు ఏర్పాటుచేయాలి. కౌంటర్‌ వివరాలు కేటాయించిన గదిపై అతికించాలి.
రైతులకు ఇబ్బంది కలుగకుండా షామియానాలు, కుర్చీలు వేయించాలి. పంపిణీ కేంద్రంలో ఒక మైక్‌ను ఫ్లెక్సీలను ఏర్పాటుచేయాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి. పాస్‌ పుస్తకం, చెక్కు రెండిండిటినీ ఒక కవర్‌లో పెట్టి రైతుకు అందించాలి. పుస్తకం లేకుండా చెక్కులు మాత్రమే వచ్చిన వాటిని తహసీల్దార్‌
నిర్ధారించిన తరువాత రైతులకు పంపిణీ చేయాలి. ప్రతి టీమ్‌కు ఒక గ్రీవెన్స్‌ అధికారిని నియమించాలి. సదరు అధికారి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ రెవెన్యూ గ్రామాలవారీగా వచ్చిన విజ్ఞప్తులను నమోదు చేయాలన్నారు.
గ్రీవెన్స్‌ అధికారి వద్ద ఆ గ్రామానికి సంబంధించిన పార్ట్‌-బీ క్యాటగిరీ ఖాతాల లిస్ట్‌ ఉంచుకోవాలి. అందులో రైతు ఖాతాలను బీ క్యాటగిరీలో ఉంచడానికి గల కారణాలను రైతులకు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
పట్టాదార్‌ పాస్‌పుస్తకం రసీదు రిజిస్టర్‌లో తప్పనిసరిగా రైతు సంతకం తీసుకోవాలి. చెక్కుల అక్విటెన్స్‌లో వ్యవసాయశాఖకు సంబంధించిన అధికారులు విధిగా సంతకం తీసుకోవాలి. టీమ్‌ లీడర్‌ ప్రతిరోజూ పంపిణీచేసిన వివరాలు, ఇంకా చేయాల్సిన వాటి వివరాలను మొబైల్‌ యాప్‌ ద్వారా రిపోర్ట్‌ పంపించాల్సి ఉంటుందన్నారు. రైతులకు పాస్‌ పుస్తకం పంపిణీ చేసేముందు రైతు సంతకం కానీ/ బొటనవేలిముద్ర కానీ పాస్‌పుస్తకంపై తప్పనిసరిగా తీసుకోవాలి.తహసీల్దార్‌, మండల వ్యవసాయాధికారి ఉదయం 6 గంటలకు మండల కేంద్రం నుంచి బయలుదేరి 6.30 గంటల కల్లా గ్రామానికి చేరుకొని పాస్‌పుస్తకాలు, చెక్కులను టీమ్‌కు అందజేయాలన్నారు.