జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వం
హైదరాబాద్,సెప్టెంబర్5(జనం సాక్షి): తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ‘యువ తెలంగాణ’ పేరుతో జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ కొత్త పార్టీని స్థాపించారు. భువనగిరికి చెందిన జిట్టా గతంలో అనేక పార్టీల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. భువనగిరి నుంచి ఎంపిగా కూడా పోటీ చేశారు. వివిధ పార్టీల తీరును గమనించి తానే పార్టీ పెట్టాలన్న సంకల్పంతో యువతెలంగాణ పార్టీని ప్రారంబించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. గతంలో టివి యాంకర్‌గా పనిచేసిన రాణి రుద్రమ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక మహిళలకు అవకాశాలు లేకుండా పోయాయన్నారు. తెలంగాణలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని మండిపడ్డారు. యువ తెలంగాణ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని రాణి రుద్రమ తెలిపారు. ప్రజలు పార్టీని ఆదరించాలని కోరారు.




