ఆ మహమ్మారి నుంచి భావిపౌరులను రక్షించుకోవాలి
అవగాహన సదస్సులో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పిలుపు
మేడిపల్లి – జనం సాక్షి
యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న నిషేధిత మాదకద్రవ్యాల సరఫరాపై నిఘాను మరింత కఠినతరం చేసి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పి రామకృష్ణ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యంతో గంజాయి మాదకద్రవ్యాల నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహనా సదస్సుకు ఎక్సైజ్ సిఐ మల్లయ్య, టాస్క్ ఫోర్స్ సి ఐ శ్రీనివాస్, మేడిపల్లి సిఐ గోవర్ధన గిరి విచ్చేసి మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని, డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలువాలని, అందుకోసం ప్రత్యేక టీంలతో విద్యాలయాల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు నేడు పీర్జాదిగూడ కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని అన్నారు. చిన్న వయసులోనే నేడు సమాజంలో యువత గంజాయి మాదకద్రవ్యాలకు అలవాటు పడుతూ తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువత దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడంతో వారి భవిష్యత్తు అంధకారంలోకి పోతుందని అన్నారు. డ్రగ్స్ కు అలవాటుపడ్డ యువతీ యువకులు చివరకు నేరాలకు పాల్పడుతూ హత్యలకు అత్యాచారాలకు ప్రేరేపితులు అవుతున్నారని అన్నారు. భారతదేశాన్ని పెనుభూతంగా మారుస్తున్న మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని, ఎవరైనా ఇలాంటి మాదకద్రవ్యాలు అమ్మినా కన్నా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు. విద్యా సంస్థల యాజమాన్యం బాధ్యతాయుతంగా డ్రగ్స్ సరఫరా నియంత్రించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పోలీస్ శాఖ సైతం మాదకద్రవ్యాల సరఫరాపై కఠినంగా వ్యవహరించాలని కోరారు అనంతరం డ్రగ్స్ సరఫరా నియంత్రణకు సహకరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ రామకృష్ణ రావు, ఎక్సైజ్ ఎస్సై శ్రావణి, మేడిపల్లి ఎస్సై చంద్రశేఖర్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలల యజమాన్యం, ప్రిన్సిపాల్స్, కారస్పాండెంట్స్ హెచ్.ఎంస్ తదితరులు పాల్గొన్నారు.




